Azadi Ka Amrit Mahotsav: దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటీష్ వారి పాలనతో విసిగివేసారిపోయిన భారతీయులు.. స్వాతంత్ర్యం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు సాగించారు. అతివాదులుగా, మితవాదులగా విడిపోయి ఎవరి పంథాలో వారు తీవ్రస్థాయిలో పోరాటాలు సాగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. చివరకు అహింసా వాది అయిన గాంధీ సైతం డూ ఆర్ డై నినాదం ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ డూ ఆర్ డై నినాదం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఒక్క నినాదంతో దేశ వ్యాప్తంగా యువత రెచ్చిపోయింది. బ్రిటీష్ వారి స్థావరాలపై దాడులకు తెగబడ్డారు. వారిని దేశం నుంచి తరిమేందుకు తమ స్థాయికి మించి పోరాటాలు సాగించారు.
ఈ సమయంలో చోటు చేసుకున్న ఘటనల్లో ఇవాళ మనం ఆగ్రాలో చోటు చేసుకున్న ఒక ఘటనతో పాటు మరికొన్ని సంఘటనల గురించి చెప్పుకోబోతున్నాం. అప్పట్లో ఆగ్రాలోని హరిపర్వత్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉండేది. దానిని తగలబెట్టాలని నాటి యువకులు ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడమే కాదు.. దానిని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసి మరీ చూపించారు.
ఆ ప్లాన్ ఏంటంటే..
1942లో ఉడేసర్ హౌస్ సమీపంలోని కోఠిలో ఆదాయపు పన్ను కార్యాలయం ఉండేది. ఆ సమయంలో విప్లవకారుడు ప్రేమ్‌దత్ పలివాల్, పండిట్ శ్రీరామ్ శర్మ బృందం బ్రిటిష్ వారు టార్గెట్‌గా ప్లాన్స్ వేశారు. మనోహర్ లాల్ శర్మ, బసంత్ లాల్ ఝా, గోపీనాథ్ శర్మ, రాంశరణ్ సింగ్, విజయ్ శరణ్ చౌదరి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రెండో గ్రూపులో స్వాతంత్య్ర సమరయోధులు తారా సింగ్ ధాక్రే, ఇంద్రపాల్ సింగ్, షేక్ ఇనామ్, రాంబాబు పాఠక్ తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి రాత్రి వేళ ఆ ఆదాయపన్ను కార్యాలయాన్ని తగులబెట్టాలని ప్లాన్ చేశారు. అయితే, అది సక్సెస్ కాలేదు.
పట్టపగలే దాడులు…
చివరికి విప్లవకారులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ వారు కార్యాలయం వద్ద బలగాలను పెంచారు. మరోవైపు తారా సింగ్ ధాక్రే బృందం ఆయుధాలతో ఆదాయపు పన్ను కార్యాలయానికి చేరుకున్నారు. ఆ కార్యలయానికి నిప్పు పెట్టారు. దాంతో ఆ ఆఫీసు దగ్ధమైంది. ప్లాన్ సక్సెస్ అవడంతో.. విప్లకారులు బ్రిటీష్ వారికి చిక్కకుండా తప్పించుకున్నారు.
పేలుడు ధాటికి రేపర్వత్ పోలీస్ స్టేషన్ గోడలు అదిరిపోయాయి..
1942లో దీపావళి రోజున రాత్రి హరిపర్వత్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన భారీ బాంబు పేలుడు కారణంగా పోలీస్ స్టేషన్ గోడలు దద్దరిల్లాయి. అయితే, విప్లవకారుడు తారా సింగ్ చేతిలో ఈ బాంబు పేలింది. దాంతో తారాసింగ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే ఛాన్స్‌గా అతడిని బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన తరువాత మిగతా విప్లవకారులందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేయడం ప్రారంభించారు బ్రిటీష్ వారు.
విప్లవకారులకు నరకం చూపారు..
ఉద్యమ సమయంలో అరెస్ట్ అయిన విప్లకారులకు బ్రిటీష్ సైన్యం నరకం చూపించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయానికి నిప్పుపెట్టిన ఉద్యమకారులందరినీ పోలీసులు తరువాతికాలంలో అరెస్ట్ చేశారు. వారికి నరకం చూపించారు. చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ ఉద్యమకారులెవరూ వెనక్కి తగ్గలేదు. బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. వారి పోరాట ఫలితమే నేడు.. స్వాతంత్ర్య భారతావని.