PM Modi: జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సుదీర్ఘ సమావేశం.. నియోజకవర్గాల పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు!

|

Jun 25, 2021 | 10:17 AM

జమ్మూ-కశ్మీర్‌కు చెందిన 14మంది అఖిలపక్ష నాయకులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం చర్చలు జరిపారు. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది.

PM Modi: జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ సుదీర్ఘ సమావేశం.. నియోజకవర్గాల పునర్విభజనపై భిన్నాభిప్రాయాలు!
Jammu And Kashmir All Party Meet
Follow us on

Jammu and Kashmir All Party Meets PM Modi: జమ్మూ-కశ్మీర్‌కు చెందిన 14మంది అఖిలపక్ష నాయకులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం చర్చలు జరిపారు. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రధాన పార్టీల ముఖ్య నేతలతో పాటు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

గురువారం నాటి సమావేశంపై ప్రధాన మంత్రి స్పందించారు. జమ్మూ-కశ్మీర్ అభివృద్ధిలో ఈ సమావేశం కీలకమైన ఘట్టమని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు.


అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలుపగా.. మెహబూబా ముఫ్తీ‌తో పాటు పలువురు జమ్మూకశ్మీర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్‌లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు నేతలు నెలల పాటు నిర్భందంలోనే ఉన్నారు. అయితే.. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించడంతో పాటు అక్కడి రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

అయితే, ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన చర్చల సందర్భంగా నేతలందరూ జమ్మూ-కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పాలనపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నియోజక వర్గాల పునర్విభజన, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణతోనే ఇది సాధ్యమవుతుందని అమిత్ షా అన్నారు. కాగా, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం-2019 ప్రకారం- అక్కడి స్థానాల సంఖ్య 90కి పెరుగుతాయి. అంతకుముందు అక్కడ 87 స్థానాలు ఉండేవి. అందులో 46 కాశ్మీర్, 37 జమ్మూ రీజియన్ కిందికి వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.


ఇదిలావుంటే, నియోజకవర్గాల పునర్విభజనకు సహకరించాలంటూ ప్రధాని చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దాదాపు అన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా ప్రతి పాతికేళ్లకోసారి నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా.. జమ్మూ కాశ్మీర్‌కు మాత్రం ప్రత్యేకంగా నిర్వహించాలని తలపెట్టడాన్ని తాము నిరాకరించినట్లు ఒమర్ అబ్డుల్లా స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో భాగమనే ఉద్దేశంతోనే 2009లో ఆ ప్రక్రియను ఇక్కడ కూడా చేపట్టారని గుర్తు చేశారు.

Read Also…  Viral News: రాత్రుళ్లు గుర్రంపై ఊరేగుతున్న తలలేని దెయ్యం.. అక్కడ నిద్రపోతే ఇక అంతే.. బెంబేలెత్తుతున్న జనం!