Assembly elections 2022: కమ్ముకున్న కరోనా చీకట్ల నడుమ రాజకీయ సెమీ ఫైనల్ సమరం!

| Edited By: Balaraju Goud

Jan 09, 2022 | 5:58 PM

కరోనా మళ్లీ కమ్ముకుంటున్న వేళ ఎన్నికలు నిర్వహించే సాహసం ఎన్నికల సంఘం చేయకపోవచ్చనే అనుకున్నారంతా! ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది.

Assembly elections 2022: కమ్ముకున్న కరోనా చీకట్ల నడుమ రాజకీయ సెమీ ఫైనల్ సమరం!
Follow us on

5 states Assembly Elections 2022: కరోనా మళ్లీ కమ్ముకుంటున్న వేళ ఎన్నికలు నిర్వహించే సాహసం ఎన్నికల సంఘం చేయకపోవచ్చనే అనుకున్నారంతా! ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది. రాజకీయ పార్టీల అభిలాషనో, అభ్యర్థనో తెలియదు కానీ ఈసీ పెద్ద బాధ్యతనే నెత్తినేసుకుంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో రాజకీయపార్టీలు వ్యూహప్రతివ్యూహాలలలో నిమగ్నమయ్యాయి. 15 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది కాబట్టి పండుగ తర్వాత ఎన్నికల సమరాంగణంలో దూకాలని డిసైడయ్యాయి. మాస్క్‌, థర్మల్‌ స్కానర్లు, శానిటైజేషన్ ఇలాంటి లాజిస్టిక్స్‌ అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఉంచుతామని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది.. ఇన్నేసి జాగ్రత్తలు ఎన్నికల సంఘం తీసుకుంటుంది సరే.. రాజకీయపార్టీలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తాయా అన్నది అనుమానమే!

మరో రెండు నెలలు ఆగితే సికందర్‌ ఎవరో తెలిసిపోతుంది. అప్పటివరకు ఎవరికి తోచిన లెక్కలు వారేసుకుంటున్నారు. ఓ విధంగా చూస్తే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ఫైనల్స్‌గా పరిగణిస్తే ఇప్పుడు జరిగే ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ లాంటివి. ఇందులో జయాపజయాలను బట్టి 2024లో గెలిచేదెవరన్నదానిపై ఓ అంచనాకు రావచ్చు. ఎన్నికలు జరగబోయే అయిదు రాష్ట్రాలలో అందరి చూపు ఉత్తరప్రదేశ్‌ మీదనే ఉంది. పెద్ద రాష్ట్రామని కాదుగానీ.. దేశ రాజకీయాలపై యూపీ బలమైన ముద్ర వేస్తుంది కాబట్టి. ఎన్నికలు జరుగుతున్న 690 అసెంబ్లీ స్థానాలలో58 శాతం అసెంబ్లీ సీట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవే! ఉత్తరప్రదేశ్ ఫలితం 2024లో జరిగే ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పైగా త్వరలో 74 రాజ్యసభ స్థానలకు జరిగే ఎన్నికపై కూడా ప్రభావం చూపుతుంది. యూపీలో విజయం సాధించి రాజ్యసభలో కూడా బలం పెంచుకోవాలన్నది బీజేపీ ఉద్దేశం!

ఇంకోటి కూడా ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ పదవీకాలం జులైలోముగుస్తుంది. కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టొరల్‌ కాలేజ్‌లో ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలని బీజేపీ అనుకుంటోంది. ఇప్పుడు ఎన్నికలు జరగబోయే అయిదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీనే అధికారంలో ఉంది.. అయిదో స్టేట్‌ను కూడా దక్కించుకోవాలన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలదని సర్వేలైతే చెబుతున్నాయి కానీ ఎన్నికల సమయానికి సమీకణాలు మారిపోవచ్చు. ఇప్పటికైతే బీజేపీ, సమాజ్‌వాదీపార్టీల మధ్యనే గట్టిపోటీ కనిపిస్తోంది. బీఎస్పీ, కాంగ్రెస్‌లకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగబోతున్నది. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాలతో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పట్లో మోదీ హవా బ్రహ్మండంగా ఉండింది. ఇప్పుడు బీజేపీ అన్ని స్థానాలు గెలవడం అసాధ్యమే! అందుకు కారణం ఆదిత్యనాథ్‌ యోగి ప్రభుత్వంపై ప్రజలలో కొంచెం అసంతృప్తి రావడమే! ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి యోగి ప్రచార భారాన్ని భుజాన వేసుకున్నారు.

ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలలకు మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. పలు ఎన్నికల హామీలను ప్రకటించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చిన్న పార్టీలను కలుపుకున్నారు. ఇప్పటికే ఆల్‌ఎల్‌డీ, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఓటు శాతం కొంచెం పెరిగింది. ర్యాలీలు, సభలతో ప్రియాంకగాంధీ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు దళిత ఓటు బ్యాంకు బహుజన్‌సమాజ్‌ పార్టీకి చెక్కుచెదరకుండా ఉండేది. ఇప్పుడు బీజేపీకి కొందరు షిఫ్టయ్యారు.

ఉత్తరప్రదేశ్‌ తర్వాత అందరి చూపు పంజాబ్‌పై ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ అక్కడ అధికారంలో ఉంది. అంతర్గత విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్‌లో ఇమడలేక అమిరీందర్‌ సింగ్‌ అందులోంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చే బాధ్యత నవజోత్‌సింగ్‌ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీలపైనే ఉంది. కాంగ్రెస్‌ గెలుపు గ్యారంటీ అనుకున్న సమయంలో ఆప్‌ తన బలాన్ని అమాంతం పెంచుకుంది. పంబాజ్‌లో గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి ఎలాగూ లేదు. అందుకే అమరీందర్‌ సింగ్ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.

ఉత్తరాఖండ్‌లో కూడా కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ కూబా ఆమ్‌ ఆద్మీ పార్టీ గణనీయంగా పుంజుకుంది. ఆప్‌ ఎవరి ఓట్లు చీలుస్తుందన్నదే ప్రశ్న. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది.. ఇదే ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. పైగా అయిదేళ్లకోసారి ప్రభుత్వాలు మారడమనేది ఉత్తరాఖండ్‌లో ఆనవాయితీగా వస్తోంది. ఆ లెక్కన ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. మరి ఓ పక్క బీజేపీని, మరో పక్క ఆప్‌ను ఎదుర్కొని కాంగ్రెస్‌ ఎలా నెగ్గుకు రాగలుగుతుందో చూడాలి.

మణిపూర్‌లో ప్రస్తుతం ఎన్డీయే అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో యూపీఏకు 28 స్థానాలు వస్తే ఎన్డీయేకు వచ్చినవి 21 సీట్లే. అయినా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలో రాగలిగింది. స్వతంత్ర అభ్యర్థులను తమవైపు లాగేసుకోగలిగింది. గోవాలో కూడా అంతే. లాస్ట్ ఎలెక్షన్‌లో యూపీఏ 17 స్థానాలు సంపాదించింది. ఎన్డీయేకు వచ్చినవి 13 సీట్లే. అయినా అక్కడా అధికారంలోకి రాగలిగింది. ఈసారి ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. మొత్తంమీద అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అమితాసక్తిని కలిగిస్తున్నాయి.

Read Also…  Akhilesh Yadav: అయోధ్య రామ మందిరంపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?