Covid Vaccine: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం వ్యాక్సిన్. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. వీలైనంత వరకు ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మరో పక్క టీకా వేసుకుంటే ఏమౌతుందో.. ప్రాణాలకు ప్రమాదం కలుగుతుందేమో అన్న అపోహలు చాలా మందిలో ఉండడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వ అధికారులు ఎన్ని రకాలుగా ప్రజలకు వివరించిన కానీ లాభం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది..
అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ కు చెందిన గ్రామస్తులలో టీకా పట్ల ఉన్న అపోహాలను తొలగించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచితంగా 20 కిలోల బియ్యం ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. ఇలా ప్రకటన చేసిన తక్కువ రోజుల్లోనే 80 మందికి పైగా టీకాలు వేయించుకునేందుకు ముందుకు వచ్చారు. సుబన్‌సిరి జిల్లాలోని యాజాలికి చెందిన సర్కిల్ ఆఫీసర్ తాషి వాంగ్‌చుక్ థాంగ్‌డోక్ ఈ ఆలోచన చేశాడు. 45 సంవత్సరాలు నిండినవారికి టీకా వేసే ఉచిత బియ్యం కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమం బుధవారం వరకు ఉంటుంది. జిల్లాలో గ్రామాలలో ఉన్న టీకా పై అపోహాలను తొలగించడానికి కృషి చేస్తున్నామని తాషి వాంగ్ చుక్ థాంగోడోక్ అన్నారు. జూన్ 20 నాటికి సర్కిల్ లో 100 శాతం టీకాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 45 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి శుక్రవారం, శనివారం వారి ఇళ్ల వద్దకే వెళ్ళనున్నట్లుగా తెలిపారు. ఆఫర్ సమయం గడిచిన తర్వాత 20 కిలోలకు బదులుగా 10 కిలోలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,95,445 మందికి టీకా వేసినట్లు రాష్ట్ర రోగ నిరోధక శాఖ అధికారి డిమోంగ్ పాడుంగ్ తెలిపారు.