AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. గోదావరి-కావేరి లింక్‌పై కీలక ప్రతిపాదనలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు జరిపారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి కేంద్ర చొరవ కోరారు. పోలవరం, విశాఖ మెట్రో, కరువు సహాయం సహా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి మోదీ సహకారం ఆవశ్యకతను వివరించారు.

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. గోదావరి-కావేరి లింక్‌పై కీలక ప్రతిపాదనలు!
Pm Modi Cm Chandrababu Meet
Balaraju Goud
|

Updated on: Oct 08, 2026 | 7:34 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (అక్టోబర్ 08) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, నీటిపారుదల, మౌలిక వసతులు, కరువు పరిస్థితులు సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు.

ప్రధాని మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

భేటీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ అందించిన సేవలను ప్రస్తావిస్తూ.. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం, సుపరిపాలనతో దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకుని వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశాన్ని నడిపిస్తున్నారని చంద్రబాబు అభినందించారు.

నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు

గోదావరి వరద జలాల్లో కొంత భాగాన్ని సమర్థంగా వినియోగించి దక్షిణాది రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చేలా నదుల అనుసంధానంపై సాంకేతిక అధ్యయనం చేపట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు. గోదావరి–కావేరి అనుసంధానం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రస్తుతం గోదావరి నుంచి సముద్రంలోకి భారీగా నీరు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించే మార్గాలను పరిశీలించాలని కోరారు.

పోలవరం, గోదావరి పుష్కరాలపై చర్చ

పోలవరం ప్రాజెక్టు పురోగతి, నిర్మాణం, పునరావాస పనులపైనా చంద్రబాబు వివరాలు అందించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరారు. 2027 గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఘాట్లు, రహదారులు, పారిశుద్ధ్యం, భద్రత తదితర మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఏపీలో కరువు.. ఎల్‌నినో ప్రభావాన్ని వివరించిన సీఎం

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడి వ్యవసాయ రంగంపై ప్రభావం పడిందని చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2026 ఖరీఫ్ సీజన్‌లో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు మధ్య సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం లోటు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కరువు నివారణ, రైతులకు ఉపశమన చర్యల కోసం ప్రత్యేక కేంద్ర సాయం అందించాలని సీఎం కోరారు.

విశాఖ మెట్రో.. బీచ్ కారిడార్‌కు కేంద్ర సహకారం!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో రైల్, బీచ్ కారిడార్ వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. విశాఖ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం కోసం ప్రధాని వద్ద ప్రతిపాదనలు ఉంచనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, వ్యవసాయ రంగంలో కొత్త సంస్థల ఏర్పాటు, బాహ్య సహాయంతో అమలవుతున్న ప్రాజెక్టులకు కేంద్ర వాటా వంటి అంశాలపైనా సీఎం చర్చించారు.

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఈ భేటీలో.. ముఖ్యంగా నీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా గోదావరి–కావేరి అనుసంధానానికి కేంద్రం నుంచి వచ్చే స్పందనపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us