Punjab Elections 2022: ‘అమరీంద్ర బాహుబలి’ బలం తోడవుతుందా? పంజాబ్‌లో బీజేపీ మ్యాజిక్ చేయబోతుందా?

మరో ఆరు మాసాల్లో పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రోజుకో ట్విస్ట్‌తో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Punjab Elections 2022: ‘అమరీంద్ర బాహుబలి’ బలం తోడవుతుందా? పంజాబ్‌లో బీజేపీ మ్యాజిక్ చేయబోతుందా?
Amarinder Singh Meet Amit Shah in Delhi
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:48 PM

Amarinder Singh: మరో ఐదు మాసాల్లో పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రోజుకో ట్విస్ట్‌తో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీకి చేరడం.. పంజాబ్ రాజకీయాల్లో ఉత్కంఠరేపుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీ కావడంతో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఇక ఆయన బీజేపీలో చేరడమే తరవాయి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో అమరీందర్ సింగ్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తాను బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ తోచిపుచ్చిన అమరీందర్ సింగ్.. తన ఢిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అసమ్మతి నేతలను (జీ-23) ఇవాళ, రేపు కలవబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి శాశ్విత అధ్యక్షుడు కావాలని.. పార్టీలో సమూళ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది సోనియాగాంధీకి కాంగ్రెస్ జీ23 నేతలు బహిరంగ లేఖ రాయడం తెలిసిందే.

అమిత్ షాతో భేటీ తర్వాత కూడా బీజేపీతో చేరికపై ఎటూ తేల్చని అమరీందర్ సింగ్…రాజకీయంగా తనకున్న అన్ని ఆప్షన్‌ను ఓపన్‌గానే పెట్టుకున్నట్లు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుని.. బీజేపీతో కలిసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని అమరీందర్ సింగ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తీర్థంపుచ్చుకోవడం ఆయన ముందున్న మరో మార్గం. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా.. సీఎం పదవి నుంచి తనను తప్పించిన కాంగ్రెస్ అధిష్టానంపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఆయన బీజేపీలో చేరితే.. పంజాబ్ ఎన్నికల లెక్కలు తారుమారైనా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటామని బీజేపీ పెద్దలు ఆయనకు ఆఫర్ ఇచ్చినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అమరీందర్ సింగ్ ఈ రెండు మార్గాల్లో ఏది ఎంచుకున్నా…తమకు లబ్ధి చేకూరుతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అమరీందర్ సింగ్ బీజేపీ వైపు వెళ్లడం.. బీజేపీ అమరీందర్ సింగ్‌కు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాల వెనుక ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అమరీందర్ సింగ్ పార్టీలో చేరితే.. పార్టీ బలహీనంగా ఉన్న పంజాబ్‌లో బలమైన రాజకీయ శక్తిగా అవతరించొచ్చన్నది కమలనాథుల యోచనగా తెలుస్తోంది. వ్యవసాయ చట్టాలపై రైతుల్లో నెలకొన్న వ్యతిరేకతను కారణంగా చూపుతూ శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ఎన్డీయే కూటమి నుంచి వైదొలగింది. తమ పార్టీతో ఎస్ఏడీ తెగతెంపులు చేసుకోవడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు షేర్ గణనీయంగా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నా అక్కడ పార్టీ బలపడే పరిస్థితులు కమలనాథులకు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ పార్టీలో చేరితే.. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గట్టి పోటీ ఇవ్వొచ్చని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు.

Pujnab Politics Amarinder Singh

Amarinder Singh

అమరీందర్ సింగ్ గతంలో అర్మీ అధికారికగా పనిచేయడంతో ఆయన జాతీయవాది కావడంతో  మొదటి నుంచీ ఆయనపై బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఉందన్న ప్రచారముంది. 2016 సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మోడీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించిన కాంగ్రెస్ నేతల్లో అమరీందర్ సింగ్ కడా ఒకరు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సిద్ధూ పాల్గొనడాన్ని బీజేపీతో పాటు అమరీందర్ సింగ్ కూడా తప్పుబట్టారు. ఆ రకంగా అమరీందర్ సింగ్, బీజేపీ మధ్య జాతీయత విషయంలో భావసారూప్యతలు ఉన్నాయి.

అయితే వ్యవసాయ చట్టాలు, దీనిపై రైతులు కొనసాగుతున్న ఆందోళనలు బీజేపీతో అమరీందర్ సింగ్‌ చేతులు కలపకుండా ప్రభావితం చేసే కీలక అంశాలు. దేశంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కాలంటే కొత్త వ్యవసాయ చట్టాలు అవసరమని బీజేపీ బలంగా భావిస్తోంది. రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే ఈ వ్యవసాయ సంస్కరణలు అవసరమని కేంద్రం మొదటి నుంచీ వాదిస్తోంది. అయితే ఇది రైతు వ్యతిరేక చట్టాలంటూ అమరీందర్ సింగ్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పోరాటానికి తన మద్ధతు ఇచ్చారు.

ఈ చిక్కుముడులను కూడా విప్పుకుని అమరీందర్ సింగ్ బీజేపీలో చేరితే.. తమ పార్టీకి రాజకీయంగా చాలా లబ్ధి చేకూరుతుందని కమలనాథులు భావిస్తున్నారు. పంజాబ్‌తో పాటు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమరీందర్ సింగ్ చేరిక ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నారు. రైతుల ఆందోళనలకు ముగింపు పలికేందుకు ఓ పరిష్కార మార్గాన్ని అమరీందర్ సింగ్.. అమిత్ షాకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా వర్కౌట్ అయితే అమరీందర్ సింగ్ బీజేపీతో కలిసి పనిచేసేందుకు మార్గం సుగమంకావడంతో పాటు.. రైతుల ఆందోళనకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో అమిత్ షాకు అమరీందర్ సింగ్ ఏ ఫార్ములా సూచించారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

Also Read..

Viral Video: ఈ కోతికి స్పైడర్‌మ్యాన్ పూనాడా ఏంటి..? వీడియో చూస్తే కన్ఫామ్‌‌గా షాకవుతారు

Crime News: సోదరుడి ఘాతుకం.. వావివరసలు మరచి అత్యాచారం.. జీవిత ఖైదు విధించిన కోర్టు