దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అధికార ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వ్యవహారం మరింత ముదిరింది. లిక్కర్ స్కామ్ కొలిక్కి రాకముందే డీటీసీ బస్సుల కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించడం సంచలనంగా మారింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కొనుగోలు చేసిన లో ఫ్లోర్ బస్సు ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. దీన్ని బీజేపీ స్వాగతించగా ఆప్ ఖండించింది. సీఎం కేజ్రీవాల్ అవినీతికి మారుపేరుగా నిలిచారని బీజేపీ నేత గౌరవ్ భాటియా విమర్శించారు. ఇప్పటికే మనీలాండరింగ్ కేసుతో పాటు లిక్కర్ స్కాంలో సీబీఐ (CBI) దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. తాజాగా బస్సుల స్కాం వెలుగులోకి వచ్చిందని మండిపడ్డారు. అయితే డీటీసీ బస్సుల కొనుగోళ్లలో ఎలాంటి స్కాం జరగలేదని ఆప్ వెల్లడించింది. అసలు లోఫ్లోర్ బస్సుల కొనుగోళ్ల టెండర్లను రద్దు చేసినప్పుడు స్కాం జరిగేందుకు ఎలా అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
కాగా 2019 జులై లో వెయ్యి లోఫ్లోర్ బస్సుల కొనుగోలు, 2020లో వాటి వార్షిక నిర్వహణకు సంబంధించిన బిడ్ల వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని ఎల్‌జీకి ఫిర్యాదు వచ్చింది. బస్సుల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఢిల్లీ రవాణాశాఖ మంత్రిని ఛైర్మన్ గా కమిటీ నియమించారు. ఇప్పటికే మద్యం పాలసీలో స్కాం కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సతమతమవుతున్న ఆప్ కు ఈ కొత్త స్కాం మరింత తలనొప్పిగా మారింది. వీటిపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. దీంతో రెండింటినీ కలిపి దర్యాప్తు చేయాలని ఎల్జీ సక్సేనా సూచించినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం