
దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన పాల్‌ఘర్ ఘటన గురించి తెలిసిందే. తమ గురువు పరమపదించారని తెలిసి అంతిమ సంస్కారాలకు వెళ్తున్న క్రమంలో.. పాల్‌ఘర్ సమీపంలో గ్రామస్థులు ఇద్దరు సాధువులపై మూకదాడికి పాల్పడి హత్య చేశారు. ఈ మరణించిన సాధువులిద్దర్నీ కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌గా గుర్తించారు. అంతేకాదు వారితో
పాటు ఉన్న డ్రైవర్‌ని కూడా హత్యచేశారు. అయితే ఈ హత్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. సాధువుల హత్యలపై సంత్ సమితి సీరియస్ అయ్యింది. ఇంతటి దారుణానికి పాల్పడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఘటనపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాశారు. వెంటనే పాల్‌ఘర్ మూకదాడిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ లేఖలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 16వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనపై.. అనేక పుకార్లు హల్ చల్ చేశాయి. తొలుత ఓ వర్గం వారే సాధువులపై మూకదాడికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాల్‌ఘర్ పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో మొత్తం 110 మందిని అరెస్ట్ చేశామని.. వీరిలో 9 మంది మైనర్లే ఉన్నారని తెలిపారు. మైనర్లని జువైనల్‌కు తరలించి.. 101 మందిని పోలీసు కస్టడీకి తీసుకున్నామన్నారు. అయితే వీరిలో ఒక్కరు కూడా ముస్లింలు లేరంటూ స్పష్టం చేశారు. కాగా.. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉండి కూడా.. వారిని రక్షించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది.