ఆగ్రా, సెప్టెంబర్ 16: చాలా మంది యువత శరీరక శుభ్రత పాటించరు. చదువుల పేరిట, ఉద్యోగాల పేరిట వారానికో, రెండు వారాలకో ఒకసారి స్నానం చేసి ‘మమ’ అనిపించేస్తుంటారు. అయితే బ్యాచిలర్ లైఫ్ అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితంలో మర్చిపోలేని అనుభవాలు చవిచూడవల్సి వస్తుంది. తాజాగా ఓ జంటకు వివాహం జరిగింది. పట్టుమని నెల రోజులు కలిసి ఉన్నారో లేదో అప్పుడే వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక వేగలేకపోయిన ఆ ఇల్లాలు ఏకంగా విడాకులు కోరుతూ కోర్టు కెక్కింది. అసలు సంగతేమంటే.. భర్త బ్యాచిలర్ లైఫ్ మాదిరిగానే మ్యారీడ్ లైఫ్‌లోనూ బొత్తిగా స్నానం చేయడం లేదట. దీంతో పెద్దలు కల్పించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో.. భర్త శరీరం నుంచి దుర్వాసన వస్తుందని, భరించలేకపోతున్నానని, ఇలాంటి వ్యక్తితో అస్సలు కలిసి ఉండలేనని తెగేసి చెప్పింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ భార్య తన భర్త రోజూ స్నానం చేయడం లేదని, తనకు విడాకులు ఇప్పించాలని వివాహం జరిగిన 40 రోజులకే కోర్టుకెక్కింది. తన భర్త ఒంటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని ఫిర్యాదు చేస్తూ ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీనిపై సదరు యువతి భర్తను ప్రశ్నించగా.. అతని సమాధానం విని అధికారులు నోరెళ్ల బెట్టారు. సాధారణంగా నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తానని, వారానికి ఒకసారి తన శరీరంపై గంగాజల్ (గంగా నది నీరు) చల్లుకుంటానని చెప్పాడు. అయితే తమ పెళ్లయిన తర్వాత ఈ 40 రోజులలో భార్య పట్టుబట్టడంతో బలవంతంగా ఆరుసార్లు స్నానం చేశానని చెప్పాడు.
దీంతో పెళ్లయిన కొద్ది వారాల్లోనే తమ మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైందని, ఆ తర్వాత తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపాడు. మహిళ తరపు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టి, విడాకులు కోరారు. పోలీసులు సర్దిచెప్పడంతో రాజేష్ ప్రతి రోజూ స్నానం చేయడానికి అంగీకరించాడు. అయితే అతని భార్య మాత్రం అతనితో కలిసి జీవించడానికి ససేమిరా అంది. దీంతో చేసేదిలేక సెప్టెంబరు 22న కౌన్సెలింగ్ కేంద్రానికి మరోమారు రావాలని దంపతులకు అధికారులు సూచించారు.