కాంగ్రెస్‌ నాయకురాలు కుష్బూకు గాలం వేస్తోన్న బీజేపీ

|

Sep 28, 2020 | 10:17 AM

సినీ నటి, రాజకీయనాయకురాలు కుష్భూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారా? ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇది నిజమేమోననిపిస్తోంది... కుష్బూ బీజేపీలో చేరతారని ఇంతకు ముందు కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి..

కాంగ్రెస్‌ నాయకురాలు కుష్బూకు గాలం వేస్తోన్న బీజేపీ
Follow us on

సినీ నటి, రాజకీయనాయకురాలు కుష్భూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారా? ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇది నిజమేమోననిపిస్తోంది… కుష్బూ బీజేపీలో చేరతారని ఇంతకు ముందు కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి.. వచ్చిన ప్రతీసారి కుష్బూ వాటిని ఖండించేవారు.. అయితే బీజేపీలోని గ్రూపు రాజకీయాలు కుష్బూను ఓ పట్టాన నిర్ణయం తీసుకోనివ్వడం లేదు.. కుష్బూ బీజేపీలోకి వస్తే పార్టీ బలం పెరుగుతుందన్నది నిజమే కానీ కమలదళంలో ఆమె కుదురుకోగలరా అన్నదే సందేహం.. మొన్నీమధ్య బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ను కుష్బూ భర్త, నట దర్శకుడు సి.సుందర్‌ కలిశారు.. అంతే …కుష్బూ బీజేపీలోకి వెళుతున్నారన్న ప్రచారం మొదలయ్యింది. ఓ మిత్రుడి ఇంట్లో సుందర్‌ ఉన్న సమయంలో అక్కడి మురుగన్ వచ్చారే తప్ప ఉద్దేశపూర్వకంగా కలిసింది కాదని అంటున్నారు సుందర్‌ సన్నిహితులు.. ఈ భేటికి అంత ప్రాధాన్యతను ఇవ్వనవసరం లేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తమిళనాడులో పార్టీని పటిష్టం చేసుకోవాలని ఉత్సాహపడుతున్న బీజేపీ అందుకు తగిన ప్రణాళికలను రచించుకోవడంలో విఫలం అవుతున్నది.. జాతీయ కార్యవర్గంలో తమిళనాడు నేతలకు చోటివ్వకపోవడంపై అక్కడ విమర్శలు మొదలయ్యాయి. చివరికి రాజాను కూడా పక్కన పెట్టడం బీజేపీ క్యాడర్‌ కినుకవహిస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి పోన్‌ రాధాకృష్ణన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కేది.. అయితే ఈసారి ఆయన కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయారు.. మంత్రివర్గంలో చోటివ్వకపోయినా కనీసం పార్టీలోనైనా పెద్ద పీట వేస్తారనుకుంటే అదీ జరగలేదు.
బీజేపీ జాతీయ కమిటీలో తమిళనాడుకు చెందిన సీనియర్లకు ప్రతీసారి చోటు దక్కేది.. కొత్త రక్తాన్ని నింపాలన్నది బీజేపీ అధినాయకత్వం ఉద్దేశమే అయితే కనీసం కొత్తవారికైనా ఛాన్స్‌ ఇవ్వాలిగా అంటున్నారు. సీనియర్‌ నేతలు పొన్‌ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, ఇలగణేషన్, హెచ్‌ రాజా వంటి బోలెడంతమంది నేతలున్నా.. ఏ ఒక్కరికీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఆరేళ్లుగా జాతీయ కార్యదర్శి పదవిలో ఉన్న హెచ్‌ రాజాను కూడా పక్కన పెట్టడం ఆశ్చర్యకరం. ఎనిమిదేళ్ల నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉంటూ వస్తున్న మురళీ ధర్‌రావును కూడా పక్కన పెట్టడంలో బీజేపీ అధిష్టానం ఉద్దేశమేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో నాయకత్వం విఫలం చెందడమే ఇందుకు కారణమని చెబుతున్నారు కొందరు.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.. ఆ ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు ఉన్నారు.. వచ్చే నెల నుంచి వెట్రివెల్‌ అంటే విజయం సాధిద్దాం అన్న నినాదంతో రాష్ట్ర పర్యటన చేయనున్నారు నేతలు..