Cyber Crime: దేశంలో సైబర్ నేరాలకు బలై.. మొదటి స్థానంలో నిలిచింది వీళ్లే

సైబర్ నేరాలు ఈమధ్య కాలంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. అసలే స్మార్ట్ యుగం. చీమ చిటుక్కమన్నా ఇట్టే పట్టేస్తుంది టెక్నాలజీ. ఇలాంటి సమాజంలో అన్నీ ఆన్లైన్‌ లావాదేవీలే జరుగుతున్నాయి. బట్టల మొదలు గృహోపకరణావ వరకూ.. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి గ్రోసరీస్ వరకూ అన్నీ ఈ కామర్స్ వేదికల నుంచే కొనుగోలు చేస్తున్నారు యువత. ఇవన్నీ చాలా మంది ఉపయోగించే ఆన్లైన్ ప్లాట్ ఫాంలు. అయితే వీటన్నింటికి భిన్నంగా క్రికెట్ బెట్టింగులు, ఇతర ఆదాయాలను గణించే యాప్‌

Cyber Crime: దేశంలో సైబర్ నేరాలకు బలై.. మొదటి స్థానంలో నిలిచింది వీళ్లే
According To The National Crime Statistics, Karnataka Is The Number One State Of Cyber Crimes In The Country

Updated on: Nov 05, 2023 | 4:57 PM

సైబర్ నేరాలు ఈమధ్య కాలంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. అసలే స్మార్ట్ యుగం. చీమ చిటుక్కమన్నా ఇట్టే పట్టేస్తుంది టెక్నాలజీ. ఇలాంటి సమాజంలో అన్నీ ఆన్లైన్‌ లావాదేవీలే జరుగుతున్నాయి. బట్టల మొదలు గృహోపకరణావ వరకూ.. ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి గ్రోసరీస్ వరకూ అన్నీ ఈ కామర్స్ వేదికల నుంచే కొనుగోలు చేస్తున్నారు యువత. ఇవన్నీ చాలా మంది ఉపయోగించే ఆన్లైన్ ప్లాట్ ఫాంలు. అయితే వీటన్నింటికి భిన్నంగా క్రికెట్ బెట్టింగులు, ఇతర ఆదాయాలను గణించే యాప్‌లను యువత అధికంగా వినియోగిస్తోంది. అంతేకాకుండా పెరిగిన జీవన ప్రమాణాల దృష్ట్యా అవసరానికి మించి ఖర్చులను చేస్తున్నారు కొందరు. అందుకోసం క్షణాల్లో అప్పు ఇచ్చే ఇన్‌స్టెంట్ లోన్ యాప్‌లను అధికంగా ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా అధిక శాతం మంది ఆర్థిక మోసాల్లో బలైపోతున్నారు. ఆర్ధిక నేరాల్లో కర్ణాటక, దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మొదటి స్థానంలో ఉన్నట్లు ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంకాల్లో తేలింది. వీటిని నియంత్రించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

దేశంలో అత్యధికంగా సైబర్‌ నేరాలు నమోదయ్యే నగరాల్లో గుర్‌గావ్‌, బెంగళూరులు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. 2020 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు ఈ రెండు నగరాలు దేశంలో సైబర్‌ నేరాలకు నిలయాలుగా గుర్తించినట్లు ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌ వెల్లడించింది. ఆన్లైన్ లావాదేవీలు పెరిగే కొద్దీ ఈ నేరాల తీవ్రత పెరుగుతున్నట్లు పై రెండు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కర్ణాటక ఐటీ శాఖ నివేదిక ప్రకారం మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 150 శాతం పెరిగింది. కేవలం ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే నిత్యం రూ.కోటికిపైగా విలువైన సొమ్మును సైబర్‌ నేరగాళ్లు దోచుకుంటున్నట్లు ప్రభుత్వ ఐటీ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టునాటికి సైబర్‌ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా దోచుకున్న మొత్తం సొమ్ము దాదాపు రూ.365 కోట్లకు చేరుకుందని అంచనా వేసింది.

2022లో ఈ సైబర్ నేరాల బారినపడ్డ బాధితులు రూ.155 కోట్లు కోల్పోగా.. కేవలం 12 శాతమే రికవరీ చేయగలిగారు. అదే 2023 నాటికి 30 శాతానికి రికవరీ రేటును పెంచినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే వివరించారు.కోవిడ్ వ్యాప్తి నుంచి 2021 చివరి వరకు బెంగళూరు సిటీకే పరిమితమైన సైబర్‌ నేరాలు.. ఈమధ్య కాలంలో ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, గ్రామాలకు విస్తరిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం విచ్చలవిడిగా పెరిగిన రుణయాప్‌లు, ఆన్లైన్ క్రికెట్‌ బెట్టింగ్‌ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సైబర్‌ కేటుగాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను కేంద్రంగా చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోది. ఈ మధ్య కాలంలో మైసూరు, మండ్య వంటి జిల్లాల్లోనూ వరుసగా రూ.20 కోట్లకు పైగా విలువైన సొమ్మును స్వాహా చేశారు. ముఖ్యంగా కాలేజీ యువత రుణ యాప్‌ల ద్వారా నగదును అప్పుగా స్వీకరించి తిరిగి చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదే అదునుగా భావించి సైబర్ కేటుగాళ్లు తమ వ్యక్తి గత వివరాలతో పాటూ బంధువుల వివరాలు సేకరించి నేరానికి పాల్పడుతున్నారు. తన వ్యక్తి గత వివరాలతో పాటూ కుటుంబసభ్యులు, స్నేహితుల వివరాలు ఇవ్వనవసరంలేదనే కనీస అవగాహన లేని కారణంగా ఈ మోసాలు జరుగుతున్నాయి. పైగా సైబర్ నేరానికి పాల్పడిన వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం లేదని కర్ణాటక సైబర్ క్రైమ్ డీజీపీ వెల్లడించారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. బెంగళూరు సిటీకి చెందిన ఉన్నత స్థాయి ఐటీ ఉద్యోగులు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారు. దీనిని బట్టీ ఈ నేరాలకు పాల్పడే వారికి అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేదని మరోసారి రుజువైంది. వీరితో పాటూ ముసలివాళ్లను కూడా టార్గెట్ చేస్తున్నారు.

ఈ సంవత్సరంలో కేవలం ఫిర్యాదుల ద్వారా గుర్తించిన డబ్బు రూ. 600 కోట్లుగా ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఇక కంప్లైంట్ ఇవ్వని వారు ఎందరో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరందరూ బయటకు వచ్చి బాధితులుగా నిలిస్తే ఈ డబ్బు విలువ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ఒక విధానాన్ని తీసుకురానుంది. అదే సైబర్ క్రైమ్ సేఫ్టీ, డేటా సెక్యూరిటీ సిస్టం. దీనిని పకడ్బందీగా అమలు చేస్తే ఈ ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..