Aam Aadmi Party State in Charges: పంజాబ్(Punjab)లో భారీ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా తమ పార్టీ బలోపేతం చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైనే ఇప్పుడు ఆ పార్టీ చూపు పడింది. గుజరాత్(Gujarat), హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) , రాజస్థాన్(Rajasthan)లో పార్టీ విస్తరణపై దృష్టి సారించింది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది మూడు రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని 9 రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఈ 9 రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం ఆప్ ఇన్‌చార్జ్‌ల పేర్లను ప్రకటించింది. తెలంగాణ ఆప్ ఇన్ చార్జ్ గా సోమ్ నాథ్ భారతిని నియమించింది.
దశాబ్దం కిందట అవినీతిపై పోరాటం అంటూ ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణంగా రూపుదిద్దుకున్న ఆప్ అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీగా మారుతోంది. ఢిల్లీలో చిన్న ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కేవలం పదేళ్ల వ్యవధిలోనే రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది. పంజాబ్‌లో స్థానిక పార్టీలతో పాటు జాతీయ పార్టీలను కూడా ఊడ్చిపారేసి అఖండ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా భగవంత్ మాన్ ను ఎన్నికలకు ముందే ప్రకటించిన ఆప్ అధినేత గెలుపు తరువాత భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కేబినెట్ ను కూడా విస్తరించారు. పంజాబ్ విజయంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా, అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో రూపుదిద్దుకుంటోందని స్పష్టమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఇంచార్జ్‌గా డాక్టర్ సందీప్ పాఠక్‌ను ఖరారు చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి చాణక్యుడు డాక్టర్ సందీప్ పాఠక్ విస్తృత సేవలు అందించారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు పార్టీ కూడా ప్రకటించడం గమనార్హం. AAP గుజరాత్ ఎన్నికలలో పూర్తి శక్తితో పోటీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. పంజాబ్ తరహాలో కొత్త వ్యూహంతో గుజరాత్‌లో ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ బాధ్యతలను సందీప్ పాఠక్‌కు అప్పగించింది ఆప్.
హిమాచల్ ప్రదేశ్‌కు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా, దుర్గేష్ పాఠక్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దుర్గేష్ పాఠక్‌కు గతంలో అతిషితో పాటు గోవా ఎన్నికల కమాండ్‌ను అప్పగించారు. ఈసారి గోవాలో పార్టీ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుపొందగలిగింది. పంజాబ్‌కు ఆనుకుని ఉన్న హిమాచల్‌లో ఎన్నికల బాధ్యతను దుర్గేష్ పాఠక్ భుజస్కంధాలపై వేయడానికి కారణం ఇదే. ఇక, ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్‌ను హర్యానా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించగా, పంజాబ్ కో ఇన్‌చార్జ్ పదవి నుండి రాఘవ్ చద్దా రిలీవ్ అయ్యారు. ఇప్పుడు ఈ బాధ్యతను డాక్టర్ సందీప్ పాఠక్ నిర్వహిస్తారు.
కాగా, ద్వారక ఎమ్మెల్యే వినయ్ మిశ్రా రాజస్థాన్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం సంస్థనే మార్చేసి మళ్లీ ప్రారంభించబోతోంది. రాజస్థాన్‌పై ఆప్ పార్టీ కన్ను ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే దీనికి ముందు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం నుండి బయటపడే మార్గం చూపి తన స్థానాన్ని సంపాదించుకుంది. అటువంటి పరిస్థితిలో, రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌ను అధికారం నుండి దింపడం ద్వారా పార్టీ తన స్థానాన్ని సంపాదించుకోవచ్చని పార్టీ భావిస్తోంది.
తెలంగాణలో ఎన్నికల బాధ్యతలను ఢిల్లీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీకి అప్పగించారు.ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ హిమాచల్‌లో పార్టీ తరఫున ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉంటారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే సంజీవ్ ఝాను రాజకీయ వ్యవహారాల బాధ్యుడిగా, మంత్రి గోపాల్ రాయ్‌ని ఎన్నికల బాధ్యుడిగా నియమించింది. హర్యానాలో రాజ్యసభ సభ్యులు సుశీల్, కేరళలో ఎ.రాజా, అస్సాంలో రాజేశ్ శర్మ ఆప్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జులుగా ఉంటారు. ఇతర రాష్ట్రాలకూ ఆఫీస్ బేరర్లను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆప్ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also… Fraud Case: ఈ-టాయిలెట్ టెండర్‌లో ఆక్రమాలు.. ముఖ్యమంత్రి కుమారుడు సహా 15మందిపై చీటింగ్ కేసు