7 నెలల్లో 25 మందిని పెళ్లాడిన మహిళ! అలా ఎందుకు చేసిందో తెలిస్తే గుండెలు జారిపోతాయ్‌..!

రాజస్థాన్ పోలీసులు 7 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకుని కోట్ల రూపాయల విలువైన వస్తువులతో పారిపోయిన అనురాధ పాశ్వాన్ అనే మహిళను అరెస్టు చేశారు. ఈ మోసం వెనుక పెద్ద ముఠా ఉందని, అనురాధ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న యువకులను లక్ష్యంగా చేసుకుని మోసం చేసిందని తెలిసింది. పోలీసులు ఈ ముఠాలోని ఇతర సభ్యులను కూడా అన్వేషిస్తున్నారు.

7 నెలల్లో 25 మందిని పెళ్లాడిన మహిళ! అలా ఎందుకు చేసిందో తెలిస్తే గుండెలు జారిపోతాయ్‌..!
Anuradha

Updated on: May 20, 2025 | 3:02 PM

ఓ మహిళ కేవలం 7 నెలల్లోనే ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుంది. వామ్మో అంత మందిని ఎందుకు చేసుకుంది అని మీకు డౌట్‌ రావొచ్చు. ఆ పెళ్లిళ్ల వెనుక పెద్ద స్కామ్‌ ఉంది. అదేంటో తెలిస్తే.. పెళ్లి కానివారికి పెళ్లి సంబంధం వచ్చిందంటేనే గుండెలు జారిపోతాయ్‌. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడే.. పెళ్లికి ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదని. ఇంతకీ మ్యాటర్‌ ఏంటంటే.. వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి, పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం భోపాల్‌లో సవాయ్ మాధోపూర్ పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ కేవలం 7 నెలల వ్యవధిలోనే 25 మంది యువకులను పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు బయటపడింది. అయితే ఈ స్కామ్‌లో ఆ మహిళ ఒక్కతే కాదు.. ఆమె వెనుక పెద్ద గ్యాంగే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన అనురాధ పాశ్వాన్ (23) గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ.. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు మకాం మార్చింది. భోపాల్‌లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల ముఠాతో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. ఒక మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫొటో చూపించేవారు. ఆ తర్వాత చట్టబద్దంగా వివాహం జరిపించి, పెళ్లి చేసినందుకు భారీగా కమీషన్‌ తీసుకునేవారు.

అనురాధ కొద్దిరోజులు అత్తారింట్లో ఉండి, వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రూ.2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సినీ ఫక్కీలో ఓ కానిస్టేబుల్‌ను పెళ్లికొడుకుగా పంపారు. ఏజెంట్‌తో సంప్రదింపులు జరపగా.. అనురాధ ఫొటో పంపించాడు. డైరెక్ట్‌గా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్.. ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రెయిడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..