Ambala suicide: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం అంబాలాలోని బలానా గ్రామంలో జరిగింది. మృతిచెందిన వారిలో సంగత్ రామ్, భార్య మహిందర్ కౌర్, కుమారుడు సుఖ్విందర్ సింగ్, సుఖ్విందర్ భార్య రినా, వాళ్ల పిల్లలు అషు, జాసిలు కూడా ఉన్నారు. సుఖ్విందర్ తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. సుఖ్విందర్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. పోస్టుమార్టమ్ కోసం మృతదేహాలను అంబాలా సిటీ సివిల్ ఆస్పిటల్‌కు తరలించారు.
సమాచారం మేరకు.. కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే ఇంట్లోకి చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను అంబాలా నగరంలోని ట్రామా సెంటర్ మార్చురీలో ఉంచారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు ప్రస్తావన ఉందని పోలీసులు చెప్పారు. అదే సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.