మనీ లాండ రింగ్, నగదు అక్రమ చెలామణి కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను త్వరితగతి విచారణకు సహకరించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విజయ్ హన్స్ రాజ్ ను అమికస్ క్యూరీగా నియమించింది. విజయ్ హన్స్ రాజ్ మంగళవారం ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు. అందులో ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్) కేసుల వివరాలున్నాయి. ప్రస్తుత, మాజీ ఎంపీల్లో 51 మందిపై మనీ లాండరింగ్ కేసులున్నాయని, అలాగే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 71 మంది ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నారని ఆ నివేదికలో విజయ్ హన్స్ రాజ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే, ఎంపీల్లో మాజీలు ఎంతమంది, సిట్టింగ్ లు ఎంత మంది అనే వివరాలను వెల్లడించలేదు.
మాజీ, ప్రస్తుత ఎంపీలు, అలాగే, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. చాలా కేసుల విచారణ నిలిచిపోయిందని, కొన్ని కేసులు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్నాయని తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను త్వరిత గతిన విచారించేలా ఆదేశాలు జారీ చేయాలన్న సీనియర్ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ విచారణ చేపట్టింది.
ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులను తమ అనుమతి లేకుండా బదిలీ చేయకూడదన్న తమ గత ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..