
బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్వాకం కారణంగా ఐదుగురు చిన్నారులు తీవ్రమైన వ్యాధి బారినపడ్డారు. తలసేమియాతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన రక్తం ఎక్కించటంతో వారు మరో ప్రాణాంతక వ్యాధి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో చోటుచేసుకుంది. ఐదుగురు తలసేమియా బాధిత చిన్నారులకు హెచ్‌ఐవీ సోకడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం ఎక్కించుకున్న తర్వాత ఏడేళ్ల బాలుడికి హెచ్‌ఐవీ సోకిందని కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాష్ట్ర ఆరోగ్య శాఖపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. దీంతో రాంచీ నుండి ఉన్నత స్థాయి వైద్య బృందం తక్షణ దర్యాప్తు చేపట్టింది.
తల్లిదండ్రుల ఫిర్యాదు తర్వాత, జార్ఖండ్ ప్రభుత్వం ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల వైద్య బృందాన్ని పంపింది. దర్యాప్తులో మరో నాలుగు కేసులు బయటపడ్డాయి. డాక్టర్ దినేశ్ కుమార్ నేతృత్వంలోని బృందం బ్లడ్‌బ్యాంక్ తనిఖీలో పలు లోపాలు గుర్తించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.
ఈ దారుణ సంఘటన ఇప్పుడు జార్ఖండ్ హైకోర్టుకు చేరుకుంది. ఈ మొత్తం విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి, జిల్లా సివిల్ సర్జన్ నుండి నివేదిక కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..