మహారాష్ట్రలోని ముంబయిలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న లోకల్ ట్రైన్‌లో ఓ 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి లైంగిక దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గిర్‌గౌన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నావీ ముంబయిలోని ఓ పరీక్ష రాసేందుకు బయలుదేరింది. ఇందుకోసం సీఎస్‌ఎమ్‌టీ వద్ద హర్బర్ లైన్ లోకల్ ట్రైన్‌ను ఎక్కింది. ఆ రైలు కదలడం ప్రారంభమైన వెంటనే ఆమె ఉన్న లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఓ 40 ఏళ్ల వ్యక్తి ఎక్కాడు. అందులో ఎవ్వరూ లేరు ఆ కంపార్ట్ మొత్తం ఖాళీగానే ఉంది. ఇంతలో ఆ ట్రైన్ వెళ్తుండగానే ఆ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అరవడం మొదలుపెట్టి దూరంగా పారిపోవడంతో.. ఆ వ్యక్తి మస్‌జీద్ స్టేషన్ వద్ద దిగిపోయాడు.
అనంతరం ఆమె రైల్వే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన జీఆర్పీ, ఆర్పీఎఫ్, ముంబయి పోలీసులు నిందితుడి కోసం గాలించారు. మస్‌జీద్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీలను పరిశీలించారు. చివరికి ఆ నిందితుడ్ని గుర్తించి సాయంత్రం 4.00 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందుతుడు రోజువారి కూలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతనిపై అత్యాచారంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.