Boy Swallows Iron Nail : దేవుడు రక్షించే వారిని ఎవరూ చంపలేరు. కోల్‌కతాలో ఇలాంటి అద్భుతం ఒకటి జరిగింది. మరణం అంచుల దాకా వెళ్లిన రెండేళ్ల బాలుడికి వైద్యులు మళ్లీ ప్రాణం పోశారు. ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఏడు అంగుళాల ఇనుప మేకును మింగేశాడు. అది అతని శ్వాసకోశ నాళంలో చిక్కుకుంది. సుమారు 21 గంటల పాటు ఆ బాలుడు ప్రాణాలతో పోరాడాడు. బాలుడి తల్లిదండ్రలు ఆ చిన్నారిని కోల్‌కతా ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఎస్‌ఎస్‌కెఎం ఇఎన్‌టి విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి పిల్లవాడిని రక్షించారు.
ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. రెండేళ్ల ముస్తాకిన్ అలీ అనే పిల్లవాడు ఉదయం తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. దీంతో పిల్లవాడి తల్లి ఏదో మింగినట్లు అనుమానించింది. మొదట రాయ్గంజ్ ఆసుపత్రికి, తర్వాత అక్కడి నుంచి మాల్డా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మేకును కనుగొనలేకపోయారు. సమయం గడుస్తున్న కొద్దీ పిల్లవాడి పరిస్థితి దారుణంగా మారుతోంది. చివరికి కుటుంబ సభ్యులు పిల్లవాడిని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అక్కడ ఎస్‌ఎస్‌కెఎం ఇఎన్‌టి స్పెషలిస్ట్ సుదీప్తా మిత్రా మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం పిల్లాడిని మా వద్దకు తీసుకువచ్చినప్పుడు అతను చాలా దారుణ పరిస్థితిలో ఉన్నాడు. ఆక్సిజన్ లెవల్ 94 కు తగ్గిపోయింది. అత్యవసర బ్రోంకోస్కోపీ శస్త్రచికిత్స చేసిన వెంటనే మేకు తొలగించాం. ఇప్పుడు పిల్లవాడి పరిస్థితి స్థిరంగా ఉందని వివరించాడు. ఈ విధంగా అతడికి రెండో లైఫ్ వచ్చింది. ఆ మేకు గొంతులోనే ఉంటే కొద్దిసేపటికి పిల్లవాడి ప్రాణాలో గాల్లో కలిసేవి. దీంతో ఆస్పత్రి వైద్యులను పలువురు అభినందిస్తున్నారు.