అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్ల ఏనుగు.. బతికించేందుకు రంగంలోకి దిగిన వంతార!

జన్యుపరమైన ఎముకల వ్యాధితో బాధపడుతూ నిలబడలేక, నడవలేక ఇబ్బంది పడుతున్న 18 నెలల ఏనుగు పిల్లకు ప్రత్యేక వైద్యం అందించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 125 నుంచి 130 కిలోల బరువున్న ఈ ఏనుగు పిల్లను కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విమానంలో తరలించారు.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్ల ఏనుగు.. బతికించేందుకు రంగంలోకి దిగిన వంతార!
Elephant Calf

Updated on: Nov 06, 2026 | 2:50 PM

జన్యుపరమైన ఎముకల వ్యాధితో బాధపడుతూ నిలబడలేక, నడవలేక ఇబ్బంది పడుతున్న 18 నెలల ఏనుగు పిల్లకు ప్రత్యేక వైద్యం అందించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 125 నుంచి 130 కిలోల బరువున్న ఈ ఏనుగు పిల్లను కేరళ నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విమానంలో తరలించారు. అక్కడి రిలయన్స్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న వంతార (Vantara) జంతు సంరక్షణ కేంద్రంలో అత్యాధునిక వైద్య చికిత్స తీసువచ్చారు. నవంబర్ 6, శుక్రవారం ఈ తరలింపు ప్రక్రియ చేపట్టారు.

క్రేన్ సాయంతో అంబులెన్స్‌లోకి..

కేరళలోని కోడనాడ్ ఏనుగుల కేంద్రంలో సంరక్షణ పొందుతున్న ఈ ఏనుగు పిల్లను తరలించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. అది సొంతంగా నిలబడలేని పరిస్థితిలో ఉండటంతో 10 నుంచి 12 మంది సిబ్బంది, క్రేన్ సహాయంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంతు అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అనంతరం నెడుంబస్సేరి విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పశువైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ప్రత్యేక చార్టర్డ్ విమానం ద్వారా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని వంతారకు తరలించారు.

పుట్టినప్పటి నుంచే ఆరోగ్య సమస్యలు

ఈ ఏనుగు పిల్లను పుట్టిన వెంటనే చికిత్స, సంరక్షణ కోసం కోడనాడ్ కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే ఒకసారి కిందపడిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కీలక విషయాలను గుర్తించారు. జన్యుపరమైన ఎముకల సమస్యలు, ముఖ్యంగా ఆస్టియోపీనియా వంటి రుగ్మతతో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. ఈ వ్యాధి కారణంగా ఎముకలు బలహీనపడటంతో ఏనుగు పిల్ల నిలబడటం, నడవటం కష్టంగా మారింది.

నాలుగు నుంచి ఆరు నెలల పాటు చికిత్స

వంతారలో ఈ ఏనుగు పిల్లకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించనుంది. ఇందులో హార్మోన్ల చికిత్సతో పాటు హైడ్రోథెరపీ (జలచికిత్స) కూడా ఉంటుంది. చికిత్సకు ఏనుగు పిల్ల స్పందించే తీరును బట్టి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును భరించేందుకు వంతార సంస్థ ముందుకొచ్చింది. చికిత్స పూర్తయ్యే వరకు కేరళకు చెందిన మావటి ఏనుగు పిల్లతోనే ఉండనున్నారు. సహాయ అటవీ పశువైద్య అధికారి సహా అటవీ శాఖ అధికారులు కూడా వంతారను సందర్శిస్తూ దాని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఈ చిన్న ఏనుగు తిరిగి కోలుకుని తన కాళ్లపై తాను నిలబడగలదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరైన వైద్యం, నిరంతర సంరక్షణతో అది ఆరోగ్యంగా కోలుకోవాలని జంతు ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us