Child Kidnap Case: 17 ఏండ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు.. లాయర్‌గా తిరిగొచ్చాడు! నిందితులకు జీవిత ఖైదు

|

Sep 23, 2024 | 7:33 PM

ఆగ్రాకు చెందిన హర్ష్ గార్గ్ 2007 ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రంలో అపహరణకు గురయ్యాడు. కొందరు దోపిడీదారులు ఖేరాగఢ్‌లోని ఓ మెడికల్‌ షాపుపై దాడికి పాల్పడ్డారు. ఆ షాపు యజమానిపై కాల్పులు జరిపి, ఆయన కుమారుడు హర్ష గార్గ్‌ (7)ను కారులో అపహరించుకుపోయారు. తమకు రూ.55 లక్షలు చెల్లించాలని..

Child Kidnap Case: 17 ఏండ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు.. లాయర్‌గా తిరిగొచ్చాడు! నిందితులకు జీవిత ఖైదు
UP Child Kidnap Case
Follow us on

ఆగ్రా, సెప్టెంబర్‌ 23: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆగ్రా జిల్లాలోని ఖేరాగఢ్‌లో 17 ఏండ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ బాలుడు.. పెరిగి పెద్దవాడై లాయర్‌గా మారి అంతేకాదు తన కిడ్నాప్‌ కేసును తానే వాదించి, ఆ కిడ్నాపర్లకు జీవిత ఖైదు పడేలా చేశాడు. వివరాల్లోకి వెళ్తే..

ఆగ్రాకు చెందిన హర్ష్ గార్గ్ 2007 ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రంలో అపహరణకు గురయ్యాడు. కొందరు దోపిడీదారులు ఖేరాగఢ్‌లోని ఓ మెడికల్‌ షాపుపై దాడికి పాల్పడ్డారు. ఆ షాపు యజమానిపై కాల్పులు జరిపి, ఆయన కుమారుడు హర్ష గార్గ్‌ (7)ను కారులో అపహరించుకుపోయారు. తమకు రూ.55 లక్షలు చెల్లించాలని హర్ష తండ్రిని డిమాండ్‌ చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా.. మిగిలిన నిందితులు మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దాక్కున్నారు. 2007 మే 6న పోలీసులకు సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు కాపు కాశారు. అయితే హర్షను మోటర్‌ సైకిల్‌పై మరో స్థావరానికి తరలిస్తున్న క్రమంలో పోలీసులకు భయపడి హర్షను వదిలేసి వెళ్లిపోపోయారు. పోలీసులు హర్షను రక్షించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు ఈ ఏడాది జూన్‌లో ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో ప్రాసిక్యూషన్‌తో ముగింపు వాదనకు వచ్చింది. అయితే కిడ్నాప్‌కు గురైన హర్ష లా చదువుకుని లాయర్‌ అయ్యి తన కేసును తానే వాదించుకున్నాడు. కోర్టులో ఏకధాటిగా 55 నిమిషాలపాటు తన వాదన వినిపించిన హర్ష గార్గ్‌.. నిందితుల తరఫు న్యాయవాది వాదనలను మట్టకరిపించాడు. దీంతో కోర్టు నిందితుల్లో 8 మందికి జీవిత ఖైదు విధించగా.. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నలుగురిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. మిగిలిన ఇద్దరు నిందితులు ఇప్పటికే మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో 2014 నుంచి కోర్టులో విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ విచారణలకు హర్ష క్రమం తప్పకుండా హాజరవుతుండటంతో.. అతనిలో న్యాయవాది కావాలన్న కాంక్ష బలపడింది. దీంతో 2022లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఆగ్రాలోని ఓ కాలేజీలో LLB పూర్తి చేశాడు. ఆ మరుసటి ఏడాదే బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నాడు. హర్ష్ ప్రాసిక్యూషన్‌లో చేరి జూన్ 2024లో తుది వాదనలు వినిపించారు. సెప్టెంబర్ 17న ప్రత్యేక న్యాయమూర్తి కిడ్నాప్ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించారు. హర్ష్ ప్రస్తుతం యూపీ ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ ఎగ్జామ్ (పిసిఎస్-జె) కోసం సిద్ధమవుతున్నాడు. ఇది లా గ్రాడ్యుయేట్‌లను సబార్డినేట్ జ్యుడిషియరీ సభ్యులుగా నియమించడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.