
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పచ్చని ప్రకృతిని ఆస్వాధించేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇది యావత్ భారత దేశాన్ని కలిచివేసింది. ఇక ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యను చేపట్టి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. భారత్ దాడిలో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ చాలా మంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపుతోంది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ నుంచి ప్రేరణ పొందిన లక్నోకు చెందిన కొందరు తల్లిదండ్రులు ఇటీవల జన్మించిన తమ ఆడ శిశువులకు “సిందూర్” అనే పేరు పెట్టారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషినగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఈ నెల 10 నుంచి 11 తేదీల్లో మహిళలు 17 మంది ఆడబిడ్డలకు జన్మినిచ్చారు. ఆ ఆ డబిడ్డలకు వారి తల్లిదండ్రులు “సిందూర్” అనే పేరు పెట్టారు. విషయాన్ని స్వయంగా ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌కే షాహి సోమవారం ఓ జాతీయా మీడియాకు చెప్పారు. అయితే ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు” భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ, తన కూతురికి ఈ ” సిందూర్” అనే పేరు పెట్టానని కుషీనగర్‌కు చెందిన అర్చన షాహి తెలిపారు.
తన కుమార్తెకు సిందూర్ అనే పేరు పెట్టిన మరో మహిళ మాట్లాడుతూ..పహల్గామ్ దాడి తర్వాత భర్తలను కోల్పోయిన అనేక మంది మహిళల జీవితాలు నాశనమయ్యాయని. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం గర్వకారణం అన్నారు. ఇప్పుడు సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగమని ఆమె చెప్పుకొచ్చారు. అందే తమ కూతురికి సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
26 మంది అమాయకుల ప్రాణాలకు భారత్ ప్రతీకారంగా తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తనకు పుట్టబోయే బిడ్డకు సిందూర్ అని పేరు పెట్టాలని అనుకున్నట్టు పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా తన కూతురికి సిందూర్ అనే పేరు పెట్టాడు. ఆ పేరు తన కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని ఆయన చెప్పారు. తన కూతురు పెద్దయ్యాక, తన పేరులోని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంటుందని ఆయన అన్నారు. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఎదుగుతుందని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…