మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న ధర్మేంద్ర ప్రధాన్..

కోల్‌కతా వేదికగా హోంమంత్రి అమిత్ షా టీఎంసీ ప్రభుత్వంపై ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో సాగుతున్నది పరిపాలన కాదు.. అది వ్యవస్థీకృత అరాచకం అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలు అధికారం మార్పు కోసం మాత్రమే కాదు.. దేశ భద్రత, పడిపోతున్న విద్యా, ఆరోగ్య ప్రమాణాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమని అన్నారు.

మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan Slams Mamata Banerjee

Updated on: Mar 28, 2026 | 5:21 PM

పశ్చిమ బెంగాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం మమతా బెనర్జీ పరిపాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతాలో ఒక ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ టీఎంసీ వైఫల్యాలను ఏకరువు పెడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, చొరబాట్లు కేవలం సంఘటనలు కావు, అవి వ్యవస్థలో అంతర్భాగమైపోయాయని ధర్మేంద్ర ప్రధాన్ ధ్వజమెత్తారు. నేడు బెంగాల్‌లో భయం, అరాచకం రాజ్యమేలుతున్నాయని, ప్రజల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోనార్ బంగ్లా పేరుతో సిండికేట్లు, ‘కట్-మనీ’ సంస్కృతి ద్వారా సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

జాతీయ భద్రతకే ముప్పు

ఈ ఎన్నికలు కేవలం అధికారాన్ని మార్చడానికి మాత్రమే కాదని, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ‘‘బెంగాల్ సరిహద్దులు దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయి. కానీ టీఎంసీ అవలంబిస్తున్న అక్రమ చొరబాట్లు, బుజ్జగింపు రాజకీయాల వల్ల జాతీయ భద్రత నేడు సవాలుగా మారింది. విఫల విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు’’ అని ఆయన మండిపడ్డారు.

ప్రతి రంగంలోనూ వైఫల్యమే..

రాష్ట్ర అభివృద్ధిని టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి నెట్టేసిందని ఛార్జిషీట్ పేర్కొంది. ఒకప్పుడు విజ్ఞానానికి నిలయమైన బెంగాల్‌లో నేడు విద్యా ప్రమాణాలు పడిపోయాయని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని బీజేపీ నేతలు దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం బెంగాల్‌కు శాపంగా మారాయని ఆరోపించారు. పాలకుల అస్తవ్యస్త నిర్ణయాల వల్ల అన్నదాతలు తీవ్ర దుస్థితిలో ఉన్నారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

ప్రజల ఆగ్రహానికి ప్రతిరూపం

అమిత్ షా విడుదల చేసిన ఈ ఛార్జిషీట్ బెంగాల్ ప్రజల ఆవేదనకు, మార్పు పట్ల వారికున్న సంకల్పానికి నిదర్శనమని బీజేపీ నాయకత్వం వెల్లడించింది. అరాచకత్వం నుండి విముక్తి పొంది, స్వర్ణ బెంగాల్ దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని వారు పిలుపునిచ్చారు.

Follow Us