షెడ్యూల్‌ కంటే ముందే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయసభలను కుదిపేసిన కీలకాంశాలివే

|

Aug 10, 2024 | 11:47 AM

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్‌ కంటే ముందుగానే ముగిశాయి. ఈసారి పలు కీలక అంశాలు ఉభయసభలను కుదిపేశాయి. బడ్జెట్‌పైనా వాడీవేడిగా చర్చ సాగింది. విపక్షాల డిమాండ్‌తో వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపారు.

షెడ్యూల్‌ కంటే ముందే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయసభలను కుదిపేసిన కీలకాంశాలివే
Parliament
Follow us on

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్‌, చైర్మన్‌. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నీట్‌ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత, వ‌య‌నాడ్ ప్రకృత్తి విప‌త్తు, రాహుల్‌పై అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు, వినేష్‌ ఫోగ‌ట్ అన‌ర్హత సహా పలు అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి. చివరగా వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం.. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో జేపీసీ పరిశీలనకు పంపింది.

పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజు 2023-24 ఆర్థిక సర్వే, ఆ తర్వాత రోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీయే 3.0 ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది పూర్తిస్థాయి బడ్జెట్. ఈ బడ్జెట్‌పై ఉభయ సభల్లో వాడీవేడిగా చర్చ సాగింది. బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశామని.. రెండు రాష్ట్రాలకే నిధులు కేటాయించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కూడా భారీగా నిధులు కేటాయించామని క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్‌పై 27 గంటల 19 నిమిషాల పాటు జరిగిన చర్చలో 181 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఇక లోక్‌సభలో రాహుల్ గాంధీ కులం గురించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అనురాగ్ మాట్లాడిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. జులై 22న ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించినప్పటికీ ఉభయ సభలు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్‌ కంప్లెక్స్‌లో జరిగిన టీ మీటింగ్‌కు లోక్‌సభ స్పీకర్‌, ప్రధాని మోదీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, పలువురు కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి