
బరువు తగ్గేందుకు అనుసరించే పంథా ప్రేరణ కలిగిస్తూనే కఠినంగా ఉంటుంది. దీనికి క్రమశిక్షణ, సహనం, స్థిరమైన అలవాట్ల కలయిక అవసరం. సిమర్ ఆరు నెలల కాలంలో 27 కిలోల బరువు తగ్గి అద్భుతమైన మార్పు సాధించారు. అతి కఠిన నియమాల కన్నా సమతుల్యతే ముఖ్యమని ఆమె తన పోస్టుల ద్వారా తెలిపారు. రోజుకు పదివేల అడుగులు నడవాలనే నిబంధన పాటించకున్నా, కేవలం కొన్ని ఆరోగ్యకర అలవాట్లతో ఈ అద్భుత పరివర్తన ఎలా సాధ్యమైందో వివరించారు.
సమగ్ర ఆహారం తీసుకోవటం వలన పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. ఎక్కువసేపు ఆకలిని నియంత్రించవచ్చు. ఈ విషయంలో సిమర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. దేహం సరిగా కోలుకోవటానికి, అనవసరమైన ఆహార కోరికలు రాకుండా ఉండటానికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని ఆమె నమ్మేవారు. ప్రతి భోజనం అయ్యాక పది నిమిషాలపాటు నడవటం జీర్ణక్రియకు సహాయపడుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది.
సిమర్ శుద్ధ ఆహారం తీసుకున్నప్పటికీ, ఇష్టమైన వాటిని పూర్తిగా మానుకోలేదు. క్యాలరీలు, మాక్రోన్యూట్రియెంట్ల లక్ష్యాల పరిధిలో తెలివిగా ప్లాన్ చేసుకొని ఆరగించారు. పరిపూర్ణత కన్నా నిలకడకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచిస్తారు.
ఆమె బరువు తగ్గటంలో దోహదపడిన దైనందిన ఆహార అలవాట్లు ఇవి. ప్రధాన ప్రొటీన్ వనరులుగా కోడి మాంసం, గుడ్లు, టోఫుపై ఆధారపడ్డారు. కార్బోహైడ్రేట్ల కోసం శుద్ధి చేసిన పిండి లేని తృణధాన్యాల రొట్టె, సాధారణ ఉడికించిన బియ్యం వంటి ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలు తీసుకున్నారు. ఆరోగ్యకర కొవ్వుల కోసం అవకాడో, తాజా పండ్లు ఆహారంలో చేర్చుకున్నారు. స్నాక్స్‌లో మఖానా, పాప్‌కార్న్, గ్రీక్ యోగర్ట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. బయట తక్కువ క్యాలరీల పానీయాలు తాగేవారు.
మరికొన్ని విజయ సూత్రాలు
ఆమె అధిక ప్రొటీన్, తక్కువ కార్బొహైడ్రేట్ ఆహారం పాటించారు. కృత్రిమ చక్కెరలు పూర్తిగా మానేశారు. వారంలో మూడు లేదా నాలుగు సార్లు కోర్ వర్కవుట్స్ చేశారు. రోజుకు 8,000 అడుగుల కన్నా ఎక్కువ నడిచేలా చూసుకున్నారు. ఎలాంటి కఠినమైన, తాత్కాలిక ఆహార నియమాలు కన్నా… స్థిరంగా పాటించగలిగే ఆహారం, వ్యాయామ దినచర్యను అలవర్చుకోమని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.