Indoor Plants: ఇంట్లో మొక్కలు అకస్మాత్తుగా చనిపోతున్నాయా? ఏ మొక్కలు ఎక్కడ పెడితే హెల్తీగా పెరుగుతాయి?

ఇల్లు పచ్చని మొక్కలతో అందంగా కళకళలాడాలని ఎంతో ఆశగా నర్సరీ నుంచి మొక్కలను తెచ్చుకుంటాం. ఎంతో శ్రద్ధగా నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నా.. కొన్ని రోజులకే ఆకులు పండిపోయి, మొక్కలు వాడిపోయి చనిపోతుంటాయి. అలాంటప్పుడు మనకు తెలియకుండానే ఏదో తప్పు చేస్తున్నామన్నమాట.

Indoor Plants: ఇంట్లో మొక్కలు అకస్మాత్తుగా చనిపోతున్నాయా? ఏ మొక్కలు ఎక్కడ పెడితే హెల్తీగా పెరుగుతాయి?
Plants Growing Indoors

Updated on: Feb 13, 2026 | 7:05 AM

మొక్కలను పెంచడానికి అద్భుతమైన నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదని, కేవలం వాటి అవసరాలను అర్థం చేసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. గార్డెనర్స్ వరల్డ్ హోస్ట్ ఆడమ్ ఫ్రాస్ట్, రాయల్ హార్టికల్చరల్ సొసైటీకి చెందిన క్లేర్ ప్రెస్టన్-పోలిట్‌లు పంచుకున్న కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటిస్తే మీ ఇల్లు పచ్చని వనంలా మారుతుంది. మీ కుండీ మొక్కలను సజీవంగా ఉంచే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది చేసే మొదటి తప్పు ఏమిటంటే.. మొక్క అందంగా ఉందని కొనేస్తారు కానీ, అది తమ ఇంటి పరిస్థితులకు సెట్ అవుతుందో లేదో ఆలోచించరు. ప్రకాశవంతమైన ఎండ వచ్చే లివింగ్ రూములు మాన్‌స్టెరా వంటి జాతులకు అనుకూలంగా ఉంటాయి. అదే సమయంలో వెచ్చదనం, తేమ ఎక్కువగా ఉండే వంట గదులు పీస్ లిల్లీ మొక్కలకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. తక్కువ వెలుతురు ఉండే చోట స్నేక్ ప్లాంట్, కాస్ట్ ఐరన్ వంటి మొక్కలను పెంచడం ఉత్తమం. ఏ మొక్కను ఎక్కడ పెట్టాలో తెలిస్తే సగం విజయం సాధించినట్టే.

నీటి వినియోగంలో జాగ్రత్తలు..

మొక్కలు చనిపోవడానికి ప్రధాన కారణం ‘ఓవర్ వాటరింగ్’ అంటే అవసరానికి మించి నీరు పోయడం. అన్ని మొక్కలకు ఒకే మొత్తంలో నీరు అవసరం లేదు. కాక్టి, సక్యూలెంట్స్ వంటి మొక్కలకు చాలా తక్కువ నీరు సరిపోతుంది. వాటికి కూడా ప్రతిరోజూ నీళ్లు పోస్తే వేర్లు కుళ్లిపోయి చనిపోతాయి. మట్టి పొడిగా ఉందో లేదో వేలితో పరీక్షించిన తర్వాతే నీరు పోయాలి. ఆకులు గోధుమ రంగులోకి మారుతున్నాయంటే అది నీరు ఎక్కువైనా లేదా తక్కువైనా ఇచ్చే సంకేతం. ఇలాంటి సమయాల్లో మట్టిని గమనించి నీటిని నియంత్రించాలి.

సీజన్ల వారీగా సంరక్షణ..

వేసవి, వసంత కాలాల్లో మొక్కలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో వారానికి రెండు మూడు సార్లు నీరు అందించాలి. కానీ శీతాకాలంలో మొక్కలు నిద్రాణ దశలోకి వెళ్తాయి. అప్పుడు వాటి పెరుగుదల నెమ్మదిస్తుంది కాబట్టి నీరు, ఎరువులు చాలా తక్కువగా ఇవ్వాలి. మట్టి పూర్తిగా ఎండిపోతేనే నీటిని అందించడం శ్రేయస్కరం.

రీపోటింగ్ ఎప్పుడు చేయాలి?

మొక్కకు తన కుండీ సరిపోవడం లేదని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. కుండీ అడుగున ఉన్న రంధ్రాల నుంచి వేర్లు బయటకు రావడం లేదా నీరు పోయగానే మట్టిలోకి ఇంకకుండా నేరుగా రంధ్రాల నుంచి బయటకు వచ్చేస్తుంటే.. ఆ మొక్కకు పెద్ద కుండీ అవసరమని అర్థం. వసంతకాలం రీపోటింగ్ చేయడానికి అత్యంత అనువైన సమయం. దీనివల్ల వేర్లు సులభంగా వ్యాపించి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

క్రిస్మస్ సమయంలో ఎంతో అందంగా కనిపించే పాయిన్‌సెట్టియాలు జనవరి వచ్చేసరికి వాడిపోతుంటాయి. ఇవి మెక్సికో వంటి వెచ్చని ప్రాంతాల నుంచి వస్తాయి కాబట్టి వీటికి వెచ్చదనం అవసరం. వీటిని చల్లని గాలి తగిలే చోట లేదా నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచకూడదు. వీటికి నెలకు ఒకసారి ఆహారం (ఎరువులు) అందిస్తూ, మట్టి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీరు పోయాలి.

సెప్టెంబర్ నుంచి వీటిని రోజుకు 12 గంటల పాటు చీకటిగా ఉండే చోట ఉంచితే, మళ్ళీ క్రిస్మస్ నాటికి ఆకులు ఎర్రగా మారి అద్భుతంగా కనిపిస్తాయి. మొక్కల పెంపకం అనేది ఒక నిరంతర అభ్యాసం. మనలాగే వాటికి కూడా ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయని గుర్తించి సంరక్షిస్తే, అవి మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ తో పాటు ప్రశాంతతను అందిస్తాయి. తక్కువ నీరు, సరైన వెలుతురు ఉంటే చనిపోని మొక్కలైన స్నేక్ ప్లాంట్ వంటి వాటితో మీ గార్డెనింగ్ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.