
ఈ రోజుల్లో టాటూలు వేయించుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే టాటూలు కేవలం స్టైల్ కోసమే కాదు.. అవి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయనే ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో,ఇటీవల జరిగిన ఒక అధ్యయనం టాటూలు వేయించుకోవడం గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. స్వీడిష్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. పచ్చబొట్లు వేయించుకోవడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పచ్చబొట్లు వేయించుకోని వారి కంటే వేయించుకున్న వారికి మెలనోమా (ఒక రకమైన తీవ్రమైన చర్మ క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో 20 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,880 మందిపై పరిశోధన జరిగింది. 10 సంవత్సరాలకు పైగా టాటూలు వేయించుకున్న వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనం సూచిస్తుంది.
టాటూ వేసినప్పుడు, సిరాను చర్మంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దానికి ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది. రోగనిరోధక కణాలు ఆ సిరా రంగును సంగ్రహించి, వాటిని శోషరస కణుపులకు తీసుకువెళతాయి. ఈ టాటూ సిరాలో క్యాన్సర్ కారకాలుగా పరిగణించే రసాయనాలు కూడా ఉంటాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయి.
ఈ అధ్యయనం టాటూలు చర్మ క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి ఉందనినిర్ధారించలేదు. అవి ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని మాత్రమే తేల్చింది. కాబట్టి టాటూ వేసుకునేవారు భయపడాల్సిన అవసరం లేదు. కానీ తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టాటూ వేయించుకునే ముందు మంచి ప్రదేశాన్ని, నాణ్యమైన సిరాను మాత్రమే ఎంచుకోవాలి. టాటూ వేయించుకున్న తర్వాత ముఖ్యంగా సూర్యరశ్మికి గురైనప్పుడు, ఆ ప్రాంతాన్ని దుస్తులతో కప్పడం లేదా సన్‌స్క్రీన్ వేయడం ద్వారా మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. టాటూ వేసిన ప్రదేశం దగ్గర చర్మం రంగులో మార్పు లేదా నిరంతర దురద ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.