
సడెన్‌గా బొద్దింకలను చూస్తే చాలా మంది కంగారుపడతారు. కొందరైతే భయంతో కేకలు వేస్తూ అక్కడికక్కడే స్తంభించిపోతారు. పాములా ప్రాణాంతకమైన విషం ఉండదు, పులిలా కాటు వేయదు, దోమల్లా నేరుగా వ్యాధులు వ్యాప్తి చేయదు.. అయినా సరే, అంత చిన్న జీవిని చూడగానే చాలా మందిలో, ముఖ్యంగా మహిళల్లో ఎందుకంత భయం నెలకొంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణాలను మనస్తత్వవేత్తలు విశ్లేషించారు.
ఎవరైనా బొద్దింకను చూసి భయపడితే దానిని కేవలం ఒక జోక్‌గా కొట్టిపారేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల ఫోబియాలలో బొద్దింకల పట్ల ఉండే విపరీతమైన భయాన్ని కట్సరిడాఫోబియా అని పిలుస్తారు. బొద్దింకను చూడగానే చేతులు, కాళ్లు చల్లబడటం, విపరీతంగా చెమటలు పట్టడం, హృదయ స్పందన అసాధారణంగా పెరగడం మరియు తాత్కాలికంగా ఆలోచనా శక్తిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, అది సాధారణ భయం కాదు. అది ఒక మానసిక స్థితి అని, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మానసిక శాస్త్ర పరిశోధనల ప్రకారం.. ఈ భయానికి మూలాలు బాల్యంలోనే లోతుగా పాతుకుపోయి ఉంటాయి. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంట్లోని పెద్దలను చూసే నేర్చుకుంటారు. కుటుంబంలో తల్లిదండ్రులకు లేదా పెద్దలకు ఇలాంటి కీటకాల పట్ల విపరీతమైన భయం ఉంటే, అది సులభంగా పిల్లల సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి చేరుతుంది. పెద్దలు భయపడటం చూసి, ఆ జీవి నిజంగానే ప్రమాదకరమైనదనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ ఫోబియా ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపిస్తుంది. మహిళలు సాధారణంగా సున్నిత మనస్కులు కావడంతో వారిలో ఈ ప్రతిచర్యలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
బొద్దింకలు మనుషులలో కేవలం భయాన్ని మాత్రమే కాదు, తీవ్రమైన విరక్తిని లేదా అసహ్యాన్ని కలిగిస్తాయి.
శారీరక నిర్మాణం, ప్రవర్తన: వాటి మెరిసే జిడ్డుగల శరీరం, ఎగిరేటప్పుడు వచ్చే శబ్దం, అకస్మాత్తుగా పైకి ఎగిరి ఒంటిపై వాలడం వంటి ప్రవృత్తి చాలా మందిలో తీవ్ర ద్వేషాన్ని రేకెత్తిస్తుంది.
దుర్వాసన: మురుగు కాలువలు, మలిన ప్రదేశాలలో జీవించడం వల్ల వాటి శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. అందువల్ల అవి తీవ్రమైన దుర్వాసనను వెదజల్లుతాయి.
ఆరోగ్య సమస్యలు: ఆస్తమా లేదా అలర్జీ బాధితులకు బొద్దింకలు చాలా ప్రమాదకరం. వాటి శరీరాలపై ఉండే అలర్జీ కారకాలు తీవ్రమైన శ్వాసకోస సమస్యలకు దారితీస్తాయి.
బొద్దింకలంటే భయం అనేది వ్యక్తిగత బలహీనత కాదు, దీని వెనుక స్పష్టమైన మానసిక, శారీరక కారణాలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ భయంతో బాధపడేవారు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఒక మంచి మనస్తత్వవేత్త సహాయంతో, కొన్ని సులభమైన పద్ధతులు, కౌన్సెలింగ్ థెరపీల ద్వారా ఈ ఫోబియాను పూర్తిగా అధిగమించవచ్చు.