
భారతీయ వంటకాల్లో ఉల్లిపాయల పాత్ర చాలా ముఖ్యమైనది. ఉల్లిపాయ లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. సలాడ్లు, చట్నీలు, శాండ్‌విచ్‌లలో, ముఖ్యంగా నాన్-వెజ్ వంటల్లో ఉల్లిపాయ తప్పనిసరి. ఉల్లిపాయలు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత సమ్మేళనాలతో నిండి ఉంటాయి. కాబట్టి అవి రోగనిరోధక శక్తిని పెంచి, మొత్తం ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివైనా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా సున్నితమైన శరీరం ఉన్నవారు వీటిని తినడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు.
కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను లేదా ఉల్లిపాయలను పూర్తిగా నివారించడం లేదా తగ్గించడం మంచిది.
మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు: పచ్చి ఉల్లిపాయల్లో టైరమైన్ అనే ఆమ్ల సమ్మేళనం ఉంటుంది. కొంతమందిలో ఈ టైరమైన్ ఆమ్లం తలనొప్పి, మైగ్రేన్లను ప్రేరేపించే అవకాశం ఉంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారు పచ్చి ఉల్లిపాయల వాడకాన్ని తగ్గించడం మంచిది.
దుర్వాసన – జీర్ణ సమస్యలు: ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాల కారణంగా వాటిని తిన్న తర్వాత నోటి దుర్వాసన చాలా కాలం పాటు ఉంటుంది. IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), సున్నితమైన కడుపు ఉన్నవారిలో ఉల్లిపాయలు గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
అలెర్జీ – ఆమ్లత్వ సమస్యలు: చాలా అరుదుగా, ఉల్లిపాయలు కొందరికి అలెర్జీలకు కారణమవుతాయి. ఇది చర్మం దురద, కళ్లు నీరు కారడం లేదా పెదవులు, నాలుక వాపు రూపంలో కనిపిస్తుంది.GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్) ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలు తింటే అది అన్నవాహిక స్పింక్టర్‌ను సడలించి, గుండెల్లో మంట, పుల్లని రుచి వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రాత్రిపూట తింటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
పై ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఉల్లిపాయలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి..
దీర్ఘకాలిక వ్యాధుల నివారణ: ఉల్లిపాయలు క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులను నివారించడానికి సహాయపడతాయి.
కంటి ఆరోగ్యం: వాటిలోని క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జీర్ణ వ్యవస్థ: ఇందులో ఉండే ఫ్రక్టాన్లు ప్రీబయోటిక్స్‌గా పనిచేసి, ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి.
గుండె ఆరోగ్యం: అవి రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో తోడ్పడతాయి.
డయాబెటిస్: ఉల్లిపాయల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇవి మంచివి.
IBS ఉన్నవారికి: ఫ్రక్టాన్లు FODMAP లలో భాగం. అందుకే IBS వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..