
ఇంట్లో ధన ప్రవాహం పెరగాలన్నా, ఆర్థిక స్థిరత్వం లభించాలన్నా వాస్తు నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు, నగలు, విలువైన వస్తువులను దాచే ప్రదేశం సరైన దిశలో ఉండాలి. లాకర్ లేదా బీరువాను ఇంట్లో ఏ దిశగా ఉండాలి..అలాగే బీరువా తలుపులు ఏ దిశకు తెరుచుకునేలా ఉండాలి..వంటి వివరాల్లోకి వెళితే..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు ఉంచే బీరువా లేదా క్యాష్ బాక్స్‌ను ఉత్తర దిశ లో ఉంచాలి. ఉత్తర దిశను సంపదకు అధిపతియైన కుబేరుడి స్థానంగా భావిస్తారు. బీరువాను గది నైరుతి మూలలో ఉంచి, దాని తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా అమర్చడం అత్యంత శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ధనాగమనం పెరుగుతుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి.
లాకర్ లేదా బీరువా లోపల ధనం ఉండే ప్రదేశానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని అమర్చాలి. లేదా లాకర్ తలుపు తెరిచినప్పుడు లోపలి డబ్బు ప్రతిబింబించేలా అద్దం ఉండటం వల్ల ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు.
డబ్బు ఉంచే ప్రదేశం లేదా క్యాష్ బాక్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. బీరువాలో లేదా లాకర్ సమీపంలో పాత పత్రాలు, చిరిగిన కాగితాలు లేదా పనికిరాని వస్తువులను ఉంచకూడదు. దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో స్థిరంగా నివసిస్తుంది.
డబ్బును ఎప్పుడూ దక్షిణం లేదా పశ్చిమం వైపు తలుపులు తెరుచుకునేలా ఉంచకూడదు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఈశాన్య మూలలో బరువైన లాకర్లను ఉంచడం వాస్తు ప్రకారం నిషిద్ధం. ఈ చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుకోవడమే కాకుండా, సమృద్ధి, శ్రేయస్సును సాధించవచ్చు.
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు మతపరమైన విశ్వాసాలు, జానపద కథలు, ప్రాంతీయ ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలుగా భావించకూడదు. ఆచారాలను పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత విశ్వాసం, సంప్రదాయం, విచక్షణపై ఆధారపడి ఉంటుంది.)