
చలిలో పాదాలు సాధారణంగా చల్లబడతాయన్న సంగతి తెలిసిందే. అయితే కొందరికీ సాక్స్ ధరించి మందపాటి దుప్పటి కప్పుకున్నప్పటికీ పాదాలు వేడెక్కవు. దీనిని వాతావరణ ప్రభావంగా భావించి విస్మరించే వారు చాలా మందే ఉన్నారు. కొన్నిసార్లు ఈ రకమైన లక్షణం అనారోగ్యానికి సంకేతంగా కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవును, ఇది డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు. కానీ డయాబెటిస్ మాత్రమే పాదాలు చల్లబడటానికి కారణం కాదు. ఎవరికైనా చాలా కాలంగా పాదాలు చల్లబడే సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండటం అవసరం. అలసిలా ఎందుకు జరుగుతుందంటే?
లేడీ హార్డింజ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఎల్‌హెచ్ ఘోటేకర్ ఏం చెబుతున్నారంటే.. డయాబెటిస్ రక్తంలో అధిక చక్కెర స్థాయిల కారణంగా నరాలు, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దీని వలన పాదాలలో తిమ్మిరి, జలదరింపు, మంట, చలి అనుభూతి, పాదాలలో నొప్పి, పొడి చర్మం, గాయాలు నెమ్మదిగా మానడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో రక్త ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. అయితే పాదాలు చల్లగా ఉండటం వల్ల మీకు డయాబెటిస్ ఉందని అర్థం కాదు. అయితే దీనితో పాటు అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువులో మార్పులు వంటి లక్షణాలు ఉంటే సంబంధిత రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
పాదాలు చల్లబడటం మధుమేహానికి సంకేతం మాత్రమే కాదు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి కూడా సంకేతం. పాదాలకు తగినంత రక్తం చేరనప్పుడు, అవి చల్లగా అనిపించడం ప్రారంభిస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, వృద్ధాప్యం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. సాధారణంగా శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్త ప్రసరణ తగ్గిస్తుంది. ఫలితంగా పాదాల చర్మం చల్లగా, కొద్దిగా నీలం రంగులో కనిపిస్తాయి. కొన్నిసార్లు తేలికపాటి నొప్పి లేదా తిమ్మిరి కూడా ఉండవచ్చు. కానీ పాదం బరువుగా ఉండి నడవడానికి ఇబ్బందిగా ఉంటే దానిని విస్మరించకూడదు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.