చాయ్ లవర్స్ తప్పక చదవాల్సిన రియల్ స్టోరీ.. 30 రోజులు టీ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
చాలా మంది చాయ్ లేకపోతే ఉండలేరు. ఢిల్లీకి చెందిన పల్లవి అనే ఐటీ ఉద్యోగిని కథ కూడా ఇదే.. కానీ ఒక చిన్న ఆలోచనతో ఆమె 30 రోజుల పాటు టీని పూర్తిగా దూరం పెట్టింది. కేవలం నెల రోజుల్లో ఆమె ఆరోగ్యంలో, అలాగే ఆమె బ్యాంక్ బ్యాలెన్స్‌లో వచ్చిన మార్పులు చూసి ఆమె అవాక్కైంది. ఇంతకీ ఆ 30 రోజుల ప్రయోగం వల్ల ఏం జరిగిందో తెలుసుకుందాం..

టీ.. ఇది లేకుండా చాలా మంది ఉండలేరు. కొంతమందికి అయితే రోజే మొదలవదు. ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువైందా.. టీ లోపల పడాల్సిందే. పని ఒత్తిడి తగ్గించుకోవడానికో లేదా ఫ్రెండ్స్‌తో ముచ్చటించడానికో రోజుకు 4-5 కప్పుల టీ తాగడం నేడు కామన్‌గా మారింది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల పల్లవి కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. నోయిడాలోని ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేసే పల్లవి, రోజంతా ఆఫీస్ బయట ఇన్ని కప్పుల టీ ఎలా తాగేసేదో ఆమెకే తెలిసేది కాదు. కానీ ఎండలు పెరగడంతో ఆమె టీ తాగడం తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 30 రోజుల పాటు బయట దొరికే టీని పూర్తిగా మానేస్తే ఏం జరుగుతుంది?* అనే ఒక వినూత్న సవాలును స్వీకరించింది. కేవలం నెల రోజుల్లో ఆమె శరీరంలో, అలాగే ఆమె బ్యాంక్ బ్యాలెన్స్‌లో వచ్చిన మార్పులు చూసి ఆమెతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.
మొదటి 4 రోజులు.. ఒక యుద్ధం లాంటి అనుభవం..
ఛాలెంజ్ మొదలుపెట్టిన మొదటి 3-4 రోజులు పల్లవికి నరకంలా గడిచాయి. సాయంత్రం కాగానే ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ టీ తాగుదాం పద అని పిలుస్తుంటే.. నో చెప్పడం ఆమెకు ఒక పెద్ద యుద్ధంలా అనిపించింది. శరీరం రోజువారీ కెఫిన్‌కు అలవాటు పడిపోవడం వల్ల.. మొదటి కొన్ని రోజులు మధ్యాహ్నం వేళ తేలికపాటి తలనొప్పి రావడం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. కానీ పట్టుదలతో 5వ రోజుకు చేరుకునే సరికి శరీరం ఆ మార్పుకు అలవాటు పడి, అంతా సాధారణ స్థితికి వచ్చింది.
టీ మానేయడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
కేవలం 10 రోజులు దాటేసరికి పల్లవి తన శరీరంలో ఊహించని మార్పులను గమనించింది..
ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మాయం: రోజువారీ టీని దూరం పెట్టడం వల్ల ఆమెకు ఉన్న కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు 90శాతం తగ్గిపోయాయి. జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడి, శరీరం చాలా తేలికగా, చురుకుగా మారింది.
గాఢమైన నిద్ర – మెరిసే చర్మం: కెఫిన్ శాతం తగ్గడం వల్ల రాత్రి పూట నిద్ర నాణ్యత పెరిగింది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా మారి, అలసట గుర్తులు మాయమయ్యాయి.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన ఏం చెబుతోంది?
హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. సాధారణంగా బయట లభించే టీలలో రుచి కోసం అధిక మొత్తంలో కొవ్వు, అదనపు చక్కెరలను ఉపయోగిస్తారు. వీటిని పూర్తిగా మానుకోవడం వల్ల శరీరం సహజంగానే డిటాక్సిఫై అవుతుంది. అంతేకాకుండా బరువును సులభంగా నియంత్రణలో ఉంచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
టీ మానేస్తే.. బడ్జెట్‌లో భారీ లాభం..
నెల ముగిశాక పల్లవి తన యూపీఐ స్టేట్‌మెంట్ చూసుకుని షాక్ అయ్యింది. బయట ఒక మంచి కప్పు టీ ధర సుమారు రూ.10 నుండి రూ.20 వరకు ఉంటుంది. రోజుకు 3-4 కప్పుల టీ, దానికి తోడు స్నాక్స్‌గా తినే సమోసాలు, బిస్కెట్లు.. వీటికి తోడు అప్పుడప్పుడు స్నేహితులకు ఇచ్చే ట్రీట్‌ల బిల్లులు.. ఇవన్నీ కలిపితే నెలకు సులభంగా రూ.3,000 నుండి రూ.4,000 వరకు ఖర్చవుతున్నట్లు ఆమె గుర్తించింది. 30 రోజుల ఛాలెంజ్ వల్ల ఈ ఖర్చు సున్నా అవ్వడంతో, కేవలం టీ మానేసి ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కొనేంత అమౌంట్ ఆదా చేయగలిగానని పల్లవి సంతోషంగా చెబుతోంది.
