Weight Loss Tips: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఈ రైతాలతో బరువు తగ్గడం చాలా సులువు..

|

May 30, 2022 | 2:54 PM

అధిక బరువుతో బాధపడుతున్నవారు నీరు అధికంగా ఉండే కూరగాయల నుంచి రైతాను తయారు చేసుకోని తగ్గవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

Weight Loss Tips: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఈ రైతాలతో బరువు తగ్గడం చాలా సులువు..
Weight Loss Raitas
Follow us on

Weight Loss Raitas: బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే.. బరువు తగ్గించడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. నీరు అధికంగా ఉండే కూరగాయలు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపుతాయి. ఇలాంటి ఆహార పదార్థాలు తక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటాయి. వేసవిలో ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పని చేస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు నీరు అధికంగా ఉండే కూరగాయల నుంచి రైతాను తయారు చేసుకోని తగ్గవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.. దీంతోపాటు అనారోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఈ రైతాలో పోషకాలు సైతం పుష్కలంగా ఉంటాయి. కూరగాయల రైతా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రైతాలో ఎలాంటి కూరగాయలను చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయ రైతా..

దోసకాయలో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిలో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ఇది పనిచేస్తుంది. దోసకాయ రైతా చేయడానికి.. దోసకాయ తురుము, ఒక కప్పు పెరుగు కావాలి. ఈ దోసకాయ తురుమును పెరుగులో వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర, ఎండుమిర్చి జోడించి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ రుచికరమైన రైతాను తినవచ్చు.

ఇవి కూడా చదవండి

బీట్‌రూట్ రైతా..

బీట్‌రూట్ రైతా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీని కోసం 1 నుంచి 2 కప్పుల పెరుగును తీసుకోవాలి.. దానికి తురిమిన బీట్‌రూట్‌ను కలపాలి. వీటితోపాటు ఒక టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పును కలపాలి. దీనికి సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా జోడించవచ్చు. ఆ తర్వాత ఈ పింక్ కలర్ రైతాను ఆస్వాదిస్తూ తినవచ్చు.

పుదీనా రైతా..

పుదీనా, పెరుగుతో రుచికరమైన రైతాను తయారు చేసుకోవచ్చు. పుదీనా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. ఈ రైతా చేయడానికి 1 నుంచి 2 కప్పుల పెరుగు, పుదీనా ఆకులు ఒక కప్పు కావాలి. దానికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలిపి మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీనిని తీసుకోవచ్చు.

సొరకాయ రైతా..

సొరకాయలో చాలా నీరు ఉంటుంది. వేసవిలో దీని వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ రైతా చేయడానికి ఉడకబెట్టిన సొరకాయ ముక్కలను బాగా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమానికి రుచికి సరిపడా.. పచ్చిమిర్చి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర కలపాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..