ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

ఎండలు మామూలుగా లేవు.. రోహిణీ కార్తె రాకముందే రోడ్లన్నీ నిప్పుల కుంపటిలా మారుతున్నాయి. ఈ సెగలకు తట్టుకోలేక చాలా మంది పొద్దుగాలనే వాకింగ్‌కు వెళ్తున్నారు. అయితే బరువు తగ్గాలనో లేక అలవాటు కొద్దీనో చాలా మంది ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Walking On Empty Stomach In Summer
Image Credit source: Getty Images

Updated on: Apr 27, 2026 | 6:40 AM

వేసవి వేడి దేశవ్యాప్తంగా సెగలు పుట్టిస్తోంది. ఈ ఎండల ధాటికి సామాన్యులే కాదు, ఫిట్‌నెస్ ప్రియులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే లేచి నడకకు వెళ్లే అలవాటున్న వారు ఈ సీజన్‌లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తుంటారు. కానీ మండే ఎండల్లో ఇలా చేయడం సురక్షితమేనా..? నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో నడక.. అందరికీ సేఫ్ కాదు

ఉదయాన్నే ఏమీ తినకుండా నడవడం అనేది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారు, శరీరంలో తగినంత నీటి శాతం ఉన్నవారు ఖాళీ కడుపుతో నడవవచ్చు. అయితే నడక పూర్తి చేసిన తర్వాత మీకు అతిగా అలసట, నీరసం లేదా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే.. అది మీ శరీరానికి సరిపడటం లేదని అర్థం. అటువంటప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

డయాబెటిస్ బాధితులకు డేంజర్ బెల్స్

మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో నడకకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమీ తినకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోవచ్చు. నడకకు వెళ్లే ముందు గుప్పెడు నానబెట్టిన శనగలు లేదా ఏదైనా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉంటాయి.

వేసవిలో డీహైడ్రేషన్ ముప్పు

మిగిలిన సీజన్లతో పోలిస్తే వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల ఖాళీ కడుపుతో నడిచే వారికి తలనొప్పి, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నడకకు వెళ్లే కనీసం అరగంట ముందు తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.

సమయం చాలా ముఖ్యం

వేసవిలో ఎండ తీవ్రత ఉదయం 7 గంటల నుండే మొదలవుతోంది. అందుకే ఉదయం 5 నుండి 6 గంటల మధ్యనే వాకింగ్ పూర్తి చేయడం ఉత్తమం. ఎండ పెరిగిన తర్వాత నడిస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం వివిధ ఆరోగ్య నివేదికల ఆధారంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి శరీరతత్వం వేర్వేరుగా ఉంటుంది.. కాబట్టి ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.)

Follow Us