
విదుర నీతి అనేది మహాభారతంలోని విదురుని మాటల సమాహారం. ఇది మనకు జీవితం ఎలా ఉండాలో చెప్పే నీతి సూత్రాల సముదాయం. విదుర నీతి పాతకాలంలో ఎంత ఉపయోగపడిందో.. ఇప్పటికీ అదే విధంగా మార్గదర్శకంగా ఉంటుంది. ఇది మనలో ధైర్యం, నిజాయితీ, నైతికత పెంచుతుంది.
విదురుడి పేరు మనకు గుర్తుండేలా చేసింది ఆయన జ్ఞానం. తన తెలివి, ధైర్యం వల్ల రాజసభలో స్థానం పొందాడు. అధికారం చూసి తల వంచలేదు. సమాజంలో ఏ పరిస్థితి వచ్చినా ధర్మం తప్పని మార్గంగా తీసుకున్నాడు. సంబంధాలు లేదా లాభం ముందు అతను నిజాన్ని ముందుంచాడు.
విదురుడు తన బోధనల్లో వ్యక్తులను మూడు వర్గాల్లో వివరించాడు. ప్రతి వర్గానికి ఏం భయమో స్పష్టంగా చెప్పాడు. దీనివల్ల మనం మన స్వభావాన్ని పరీక్షించుకోవచ్చు. ఎవరిని నమ్మాలి..? ఎవరికి దూరంగా ఉండాలి అన్న విషయాల్లో స్పష్టత వస్తుంది.
నీతిహీనమైన వ్యక్తులు.. ఇలాంటి వ్యక్తులందరి దృష్టి కేవలం తిండి, దుస్తులు, భద్రత మీద ఉంటుంది. ధర్మం, నిజం లాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. కడుపు నిండితే చాలు అనుకునే మనస్తత్వం ఉంటుంది. అలాంటి వాళ్లు అవసరాల కోసం ఏమైనా చేయగలరు. వీరు జీవిత లక్ష్యంగా నైతికతను కాకుండా సౌకర్యాలను ఎంచుకుంటారు.
మధ్యస్థంగా ఉండే వ్యక్తులు.. వీరు ఒకరోజు ధర్మంగా ప్రవర్తిస్తే, మరుసటి రోజు స్వార్థంతో ఉంటారు. వీరిలో కొంత భయం, కొంత నైతిక విలువలు ఉంటాయి. అయితే వారి మిగిలిన జీవితంపై ఒక అనిశ్చితి కొనసాగుతుంది. ముఖ్యంగా మరణం గురించి ఆలోచించేవారు మరింత అస్థిరంగా ఉంటారు. కొందరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ప్రయత్నించినా భయం వారిని వెనక్కి లాగుతుంది.
ఉత్తమ వ్యక్తుల లక్షణాలు.. వారు భౌతిక జీవితం గురించి పెద్దగా ఆలోచించరు. ఉపాధి లేకపోవడాన్ని పెద్ద సమస్యగా చూడరు. మరణం కూడా వారికి భయంగా అనిపించదు. కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోలేరు. గౌరవం పోవడమే వారికీ పెద్ద దెబ్బ. నిజాయితీ, ఆత్మగౌరవం, ధర్మానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తారు.
విదుర నీతి మన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఏ తరగతికి చెందినవారమో తెలుసుకొని మార్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గౌరవం, సత్యం, ధర్మం మీద నిలబడాలనే శక్తిని ఇది మనకు ప్రసాదిస్తుంది.