
పిల్లలు తరచుగా పక్క తడుపుతుంటారు.. పక్క తడపడం అంటే పిల్లలు రాత్రిపూట అప్రయత్నంగా మూత్ర విసర్జన చేయడం. దీని కారణంగా, పిల్లలు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు వారిని కఠినంగా తిడుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో, పిల్లలు ఏ వయస్సు వరకు పక్క తడపడం సాధారణమో, ఏ వయస్సులో తల్లిదండ్రులు వైద్యుడి సలహా తీసుకోవడం అవసరమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల ప్యాట్రిషియన్ డాక్టర్ రవి మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంటూ, ఏ వయస్సు వరకు పిల్లలు పక్క తడపడం వారి జీవసంబంధమైన సమస్య కారణంగా ఉంటుందో తెలియజేశారు.
డాక్టర్ రవి మాలిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకవేళ మీ పిల్లల వయసు 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉండి, వారు రాత్రి పూట పక్క తడుపుతుంటే అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వయసులో పిల్లల నరాల వ్యవస్థ (Nervous system) పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. ఫలితంగా, నిద్రలో ఉన్నప్పుడు మూత్రాశయాన్ని (Bladder) నియంత్రించే సామర్థ్యం వారి మెదడుకు వెంటనే అందదు. ఇది పూర్తిగా జీవసంబంధమైన (Biological) ప్రక్రియే తప్ప పిల్లల ప్రవర్తన లోపం కాదు. సాధారణంగా 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారి శరీరంలో నియంత్రణ పెరిగి, ఈ అలవాటు దానంతట అదే తగ్గిపోతుంది.
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి పూట ఏదైనా భయంకరమైన సినిమా చూడటం వల్లో లేదా దెయ్యాల కథలు వినడం వల్లో భయపడి పక్క తడుపుతున్నారని భావిస్తారు. కానీ, ఇందులో నిజం లేదని డాక్టర్ స్పష్టం చేశారు. భయానికి, పక్క తడపడానికి ఎటువంటి సంబంధం లేదు. దీనికి ఏకైక కారణం కేవలం వారి నరాల వ్యవస్థ ఇంకా పూర్తిగా పరిపక్వం చెందకపోవడమే.
5 ఏళ్ల లోపు పిల్లలు పక్క తడిపినప్పుడు వారిని అస్సలు తిట్టకూడదు లేదా శిక్షించకూడదు. అలా చేయడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి పెరిగి సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. అయితే, మీ పిల్లల వయసు 6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వారంలో కొన్ని రోజులు నిరంతరాయంగా పక్క తడుపుతుంటే మాత్రం ఖచ్చితంగా పీడియాట్రీషియన్‌ను సంప్రదించాలి. వైద్యులు కొన్ని సాధారణ, సమర్థవంతమైన పద్ధతులు, చిట్కాల ద్వారా ఈ సమస్యను సులభంగా దూరం చేస్తారని డాక్టర్ రవి మాలిక్ సూచించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..