
విదేశీ పర్యటన కేవలం కల కాదు. సరైన ప్రణాళిక, జాగ్రత్తగా ఎంపిక చేసుకునే గమ్యస్థానం ఉంటే, తక్కువ ఖర్చుతోనే విదేశాలు చుట్టేసి రావొచ్చు. ముఖ్యంగా, భారతీయ రూపాయి బలంగా ఉన్న దేశాలకు వెళ్ళడం తెలివైన నిర్ణయం. ఖర్చు చాలా తక్కువ అవుతుంది. కొన్ని దేశాల్లో భారతీయ రూపాయి విలువ అక్కడి కరెన్సీ కంటే చాలా ఎక్కువ. ఆ దేశాలు ఏమిటో, అక్కడికి ఎందుకు వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం.
తక్కువ ఖర్చుతో విదేశీ పర్యటన
వియత్నాం: ఒక రూపాయికి సుమారు 300 వియత్నామీస్ డాంగ్ లభిస్తాయి. ఇది ఆసియాలో బడ్జెట్ ప్రయాణానికి గొప్ప ఎంపిక. అక్కడి వీధుల్లో లభించే ఆహారం, నైట్ లైఫ్, పర్యాటక ప్రదేశాలు చాలా చౌక.
ఇండోనేషియా: అద్భుతమైన బీచ్ లు, ద్వీపాలు, అడవులకు ఇండోనేషియా ప్రసిద్ధి. ఇక్కడ ఒక రూపాయికి సుమారు 184 ఇండోనేషియన్ రూపియా వస్తుంది. బాలి వంటి ప్రదేశాలు మన బడ్జెట్ లోనే సందర్శించవచ్చు.
శ్రీలంక: భారతీయులకు వీసా సులభంగా లభిస్తుంది. అలాగే ఒక రూపాయి విలువ సుమారు 3.44 శ్రీలంక రూపాయలు. అక్కడి బౌద్ధ క్షేత్రాలు, బీచ్ లు, తేయాకు తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
నేపాల్: మన పొరుగు దేశం నేపాల్ కు వెళ్లాలంటే వీసా అవసరం లేదు. అక్కడ ఒక రూపాయికి 1.60 నేపాలీ రూపాయలు లభిస్తాయి. పర్వతాలను ఇష్టపడేవారికి ఇది అనువైన ప్రాంతం.
థాయిలాండ్: ఫుకెట్ బీచ్ లు, బ్యాంకాక్ వీధులు, అక్కడి ఆహారం చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇక్కడ ఒక రూపాయి విలువ సుమారు 0.43 థాయ్ బాట్.
ఈ దేశాలన్నీ తక్కువ ఖర్చుతో గొప్ప అనుభూతిని ఇస్తాయి. రూపాయి విలువ అధికంగా ఉండడం వల్ల విమాన ఖర్చు మినహాయించి, అక్కడి ఖర్చులను సులభంగా నిర్వహించవచ్చు. భారతీయ పర్యాటకులకు ఇవి అద్భుతమైన అవకాశాలు.