Laknavaram Lake: ఒడ్డుపైకి తేలిన బోట్స్.. లక్నవరంలోని నీళ్లన్నీ ఏమయ్యాయి.. ఎందుకు వెలవెలబోతోంది..?

| Edited By: Balaraju Goud

Jun 29, 2024 | 8:54 AM

తెలంగాణ రాష్ట్ర పర్యాటక ముఖచిత్రానికి కంఠాభరణం ఈ లక్నవరం. చుట్టూ కొండలు, ఆ కొండలకు ఆకుపచ్చ రంగేసినట్లు పరుచుకున్న పచ్చదనం. ఎలాంటి వారికైనా సరే ఈ ప్రకృతి అందాలను చూస్తే మనసు పులకరించిపోతుంది. లక్నవరం సరస్సులో నీళ్లపై వేలాడే సస్పెన్షన్ బ్రిడ్జిపై గడిపితే ఏదో తెలియని ఆనందం మనలో ఉప్పొంగి పోతుంది.

Laknavaram Lake: ఒడ్డుపైకి తేలిన బోట్స్.. లక్నవరంలోని నీళ్లన్నీ ఏమయ్యాయి.. ఎందుకు వెలవెలబోతోంది..?
Laknavaram Lake
Follow us on

నిత్యం జలకళ.. సందర్శకుల కీలకిలలతో అలరారే లక్నవరం టూరిజం స్పాట్ ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. నిండు కుండలా తునికిసలాడే ఆ సరస్సు నిర్మానుష్యంగా మారింది. అసలేం జరిగింది..? ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఎందుకు ఎడారిని తలపిస్తుంది.? లక్నవరంలో వాటర్ డెడ్ స్టోరిజీకి చేరుకోవడానికి కారణాలేంటి..? ప్రస్తుతం లక్నవరం పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలంగాణ రాష్ట్ర పర్యాటక ముఖచిత్రానికి కంఠాభరణం ఈ లక్నవరం. చుట్టూ కొండలు, ఆ కొండలకు ఆకుపచ్చ రంగేసినట్లు పరుచుకున్న పచ్చదనం. ఎలాంటి వారికైనా సరే ఈ ప్రకృతి అందాలను చూస్తే మనసు పులకరించిపోతుంది. లక్నవరం సరస్సులో నీళ్లపై వేలాడే సస్పెన్షన్ బ్రిడ్జిపై గడిపితే ఏదో తెలియని ఆనందం మనలో ఉప్పొంగి పోతుంది.

కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు సైతం లక్నవరం సందర్శనకు వస్తుంటారు. ఈ ప్రకృతి అందాల మధ్య తనివితీరా ఎంజాయ్ చేసి ఆనందంతో మురిసిపోతుంటారు. కానీ ఇప్పుడు లక్నవరం ఓ ఎడారిని తలపిస్తుంది. ఈ ఏడాది ఎండలు అంత పెద్ద ప్రభావం చూపకపోయిన లక్నవరం సరస్సులోని నీరంతా అడుగంటి పోయింది. జలకళతో ఉట్టిపడే ఈ సరస్సు ఇప్పుడిలా పూర్తి నిర్మానుష్యంగా మారింది.. చెరువులో బోట్ షికారు చేయాల్సిన చోట కార్లు, ఇతర వాహనాలు తిరుగుతుండడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు.. బోట్స్ మొత్తం ఒడ్డుకు తేలాయి. నీటి పై వేలాడే సస్పెన్షన్ బ్రిడ్జి పై ఎంజాయ్ చేయడం కోసం వచ్చే పర్యాటకులు ఇక్కడ లక్నవరం డెడ్ స్టోరేజ్ ని చూసి తీవ్ర నిరాశ చెందుతున్నారు.

వీడియో…

రామప్ప కు యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత లక్నవరంకు కూడా పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులు పక్కనే ఉన్న లక్నవరంలోని వేలాడే వంతెన పై ఎంజాయ్ చేయడానికి పరుగులు తీస్తున్నారు. కానీ వేసవి ప్రభావంతో అడుగంటిన సరస్సును చూసి నిరాశ చెందుతున్నారు. లక్నవరం సరస్సు పూర్తి వాటర్ స్టోరేజీ కెపాసిటీ 33.06 అడుగులు.. లక్నవరం ఆయకట్టు ప్రాంతంలో 12వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క లక్నవరం ప్రక్షాళనకు వెంట పడ్డారు.

గతంలో ఇరిగేషన్, టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు లక్నవరం వాటర్ డెడ్ స్టోరేజ్ కు రాకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి వాటర్ లక్నవరం సరస్సులోకి లిఫ్ట్ చేస్తే ఇలాంటి సమస్య రాదని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాగు – సాగు నీటి అవసరాలు తీరడంతో పాటు, లక్నవరం సరస్సులో నిత్యం జలకళ ఉంటుందని భావించారు. కానీ ఆ ప్రతిపాదన ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం పై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పర్యాటక ప్రదేశం ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. పచ్చటి కొండల మధ్య ఎంజాయ్ చేయడం కోసం వచ్చే పర్యాటకులు తీవ్ర నిరుత్సాహంతో వెళ్లి పోతున్నారు.

ప్రస్తుతం మంత్రి సీతక్క లక్నవరం సరస్సు ప్రక్షాళనకు అడుగులు వేస్తున్నారు.. వచ్చే ఏడాది లోపైనా గోదావరి జలాలతో లక్నవరం నిండు కుండలా తునికిలాడుతుందని అంతా భావిస్తున్నారు. అదే జరిగితే ఈ సరస్సు నిత్యం జలకళతో ఉట్టిపడుతుంది. తెలంగాణకు తలమానికంగా మారుతుందనడంలో ఏ సందేహం లేదు..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..