
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. ఏ మాత్రం సమయం దొరికినా కోనేటి రాయుడిని దర్శించుకోవాలి.. తమ మొక్కులు తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ముఖ్యంగా పిల్లలకు సెలవులు వస్తే స్వామి దర్శనానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే శ్రీవారి దర్శనం టిక్కెట్లు, పిల్లలతో వెళ్తే ఉండడానికి రూమ్ తో పాటు అప్పటికప్పుడు అంటే ట్రైన్ జర్నీ టికెట్లు దొరకవని నిరుత్సాహ పడుతుంటారు. అటువంటి భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే మలయప్ప స్వామిని దర్శించుకునే వీలుని కల్పిస్తోంది. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు అమ్మవారిని , శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకునే వీలు కల్పిస్తోంది. తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే పేరుతో అందిస్తోన్న స్పెషల్ టూర్ ప్యాకేజీ వివరాల గురించి తెలుసుకుందాం..
శ్రీవారి భక్తులు ముందుగా ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా సౌకర్యవంతంగా సుఖంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్ర మొత్తం రాత్రులు, రెండు పగళ్లుగా సాగుతుంది. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ వారంలో ఐదు రోజులు అందుబాటులో ఉండనుంది. గురు, శుక్రవారాలు మినహా ప్రతి రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఫస్ట్ డే: హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12797) రాత్రి 8:05 గంటలకు తిరుపతికి బయలు దేరాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణించి తెల్లవారుజామున తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
సెకండ్ డే: ఉదయమే తిరుపతికి చేరుకుంటారు. హోటల్ కు వెళ్లి ఫ్రెషప్ అయ్యి.. టిఫిన్ తిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం బయలుదేరాల్సి ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత లంచ్ చేసి.. ఇక్కడ నుంచి శ్రీ కాళహస్తి కి వెళ్ళాలి. ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకుని రాత్రికి తిరుపతికి చేరుకోవాలి. రాత్రి హోటల్ లోనే బస చేయాలి.
థర్డ్ డే: మూడో రోజు తెల్లవారు జామునే రెడీ అయ్యి.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలు దేరాలి. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరిగి తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. సాయంత్రం హోటల్ చెకౌట్ చేసి తిరుగు ప్రయాణం అవ్వాలి. సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకొని 06:35 గం. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12798) ఎక్కాల్సి ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణం చేసి నాలుగో రోజు ఉదయం 06:20 గం. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. దీంతో తిరుపతి టూర్ ముగుస్తుంది.
ప్రస్తుతం రేపటి నుంచి అంటే మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటే IRCTC అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు. లేదా 9701360701 / 9281030712 నెంబర్లకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాత్ర ప్యాకేజీ ద్వారా ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..