IRCTC: మేఘాలయ, అసోం అందాలు చూడాలనుకుంటున్నారా? విశాఖపట్నం నుంచి 8 రోజుల విమాన యాత్ర
IRCTC Meghalaya Assam Tour Package 2026 Telugu: మేఘాలయ, అసోం ప్రకృతి అందాలను చూడాలనుకునే పర్యాటకులకు IRCTC అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. విశాఖపట్నం నుంచి విమానంలో 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో షిల్లాంగ్, చిరపుంజి, డావ్కీ, మావ్లిన్నాంగ్, కజిరంగా, గువాహటి వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. డిసెంబర్ 2న ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ధరలు, ప్రయాణ వివరాలు తెలుసుకోండి.

IRCTC Meghalaya Assam Tour Package 2026 Telugu: ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు, పచ్చని లోయలు, జలపాతాలు, స్వచ్ఛమైన సరస్సులు, అందమైన గ్రామాలను చూడాలనుకునే పర్యాటకులకు ఈశాన్య భారతదేశం చక్కటి పర్యాటక గమ్యం. ముఖ్యంగా మేఘాలయ, అసోం రాష్ట్రాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాల్లోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘Clouds Of Meghalaya And Assam’ పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో షిల్లాంగ్, చిరపుంజి, డావ్కీ, మావ్లిన్నాంగ్, కజిరంగా, గువాహటి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
డిసెంబర్ 2న విశాఖపట్నం నుంచి ప్రయాణం
ఈ టూర్ ప్యాకేజీ 7 రాత్రులు, 8 రోజుల పాటు కొనసాగుతుంది. 2026 డిసెంబర్ 2న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ మీదుగా ఇండిగో విమానంలో గువాహటికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణం డిసెంబర్ 9న గువాహటి నుంచి కోల్‌కతా మీదుగా విశాఖపట్నానికి ఉంటుంది. ఈ టూర్‌లో మొత్తం 29 మంది పర్యాటకులకు అవకాశం కల్పించారు.
8 రోజుల టూర్‌లో ఏయే ప్రదేశాలు చూడవచ్చు?
- మొదటి రోజు: విశాఖపట్నం నుంచి బయలుదేరి సాయంత్రానికి గువాహటికి చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి షిల్లాంగ్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బస చేస్తారు.
- రెండో రోజు: షిల్లాంగ్ నుంచి చిరపుంజికి వెళ్లి ఎలిఫెంటా జలపాతం, నోహ్కలికై జలపాతం, మావ్స్మై గుహలు, సెవెన్ సిస్టర్స్ జలపాతాలను సందర్శిస్తారు.
- మూడో రోజు: డావ్కీ సరస్సు, ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరొందిన మావ్లిన్నాంగ్, లివింగ్ రూట్ బ్రిడ్జిని సందర్శిస్తారు.
- నాలుగో రోజు: షిల్లాంగ్‌లోని డాన్ బాస్కో మ్యూజియం, వార్డ్స్ సరస్సును సందర్శిస్తారు. సాయంత్రం షాపింగ్ చేసేందుకు సమయం కేటాయించారు.
- ఐదో రోజు: షిల్లాంగ్ నుంచి కజిరంగాకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో ఉమియం సరస్సును సందర్శిస్తారు. రాత్రికి కజిరంగాలో బస చేస్తారు.
- ఆరో రోజు: తెల్లవారుజామున కజిరంగా నేషనల్ పార్కులో సఫారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే సఫారీ ఖర్చు పర్యాటకులే భరించాలి. అనంతరం గువాహటికి చేరుకుంటారు.
- ఏడో రోజు: గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి అదనపు ఛార్జీలు చెల్లించాలి.
- ఎనిమిదో రోజు: అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి గువాహటి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నానికి తిరిగి వస్తారు.
ప్యాకేజీ ధరలు, వసతి సౌకర్యాలు
ఈ ప్యాకేజీలో షిల్లాంగ్‌లో 4 రాత్రులు, కజిరంగాలో ఒక రాత్రి, గువాహటిలో 2 రాత్రులు బస కల్పిస్తారు. రోజూ అల్పాహారంతో పాటు 6 రోజుల పాటు రాత్రి భోజనం అందిస్తారు. ప్రయాణం, సందర్శనల కోసం ఏసీ టెంపో ట్రావెలర్ ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
ప్యాకేజీ ధరలు (ఒక్కొక్కరికి):
- సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.75,850
- డబుల్ ఆక్యుపెన్సీ: రూ.62,150
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.58,550
- 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో: రూ.51,350
- 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా: రూ.45,350
- 2–4 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా: రూ.37,600
ఈ టూర్‌లో లంచ్, ఎంట్రీ టికెట్లు, ఆలయ దర్శన టికెట్లు, కజిరంగా జంగిల్ సఫారీ, బ్రహ్మపుత్ర క్రూయిజ్ ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. హోటల్ వసతి కోసం షిల్లాంగ్‌లో హోటల్ ల్యాండ్‌మార్క్ హిల్స్, కజిరంగాలో లా వ్యూ హోటల్ అండ్ రిసార్ట్, గువాహటిలో హోటల్ గేట్‌వే గ్రాండియర్ లేదా వాటికి సమానమైన హోటళ్లను ఏర్పాటు చేస్తారు.
మొత్తంగా మేఘాలయలోని మేఘాలను తాకే కొండలు, జలపాతాలు, ప్రకృతి అందాలతో పాటు అసోంలోని వన్యప్రాణులు, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకే యాత్రలో చూడాలనుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశం.
గమనిక: విమాన సమయాలు, ప్రయాణ ప్రణాళికలో స్థానిక పరిస్థితులు, నిర్వహణ కారణాల వల్ల మార్పులు ఉండవచ్చు. బుకింగ్ చేసే ముందు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పరిశీలించాలి.
ఐఆర్‌సీటీసీ అస్సాం, మేఘాలయ టూర్ ప్యాకేజీ మరిన్ని వివరాలు, టికెట్ బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
