
సాధారణంగా కాగితం నీటిని పీల్చుకుంటుంది. కాబట్టి పేపర్ కప్పులు తడవకుండా ఉండటానికి వాటి లోపల హై-డెన్సిటీ పాలిథిలిన్ అనే ప్లాస్టిక్ పొరను అతికిస్తారు. మనం 85 నుండి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉన్న పానీయాలను ఈ కప్పుల్లో పోసినప్పుడు, కేవలం 15 నిమిషాల్లోనే సుమారు 25,000 మైక్రో-ప్లాస్టిక్ కణాలు ఆ పానీయంలో విడుదలవుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఆరోగ్యంపై ప్రభావం:
ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలతో పాటు ‘ఫ్లోరైడ్’, ‘క్లోరైడ్’ మరియు ‘సల్ఫేట్’ వంటి హానికరమైన రసాయనాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కలిగే నష్టాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు మొదలవుతాయి. క్రమంగా ఇవి ప్రేగులకు సంబంధించిన వ్యాధులను కలిగిస్తాయి. హార్మోన్ల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. థైరాయిడ్, ఇతర హార్మోన్ల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది.
అంతేకాదు.. ఈ పేపర్ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ రసాయనాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
అందుకే సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఆశ్రయించాలని నిపుణులు సూచించారు.
పేపర్ కప్పులకు బదులుగా మట్టి కప్పులు వాడమని సూచిస్తున్నారు. ఇవి పర్యావరణానికి, ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైనవి. వీటిలో తాగడం వల్ల సహజమైన మట్టి సువాసన కూడా లభిస్తుంది. లేదంటే,స్టీల్ గ్లాసులు ఉన్నా సరే. ఇంట్లో లేదా ఆఫీసులో వీలైనంత వరకు స్టీల్ లేదా మెటల్ గ్లాసులను వాడటం అలవాటు చేసుకోండి. గాజు గ్లాసులు కూడా ఉత్తమం. ఇవి వేడిని తట్టుకుంటాయి. ఎటువంటి రసాయనాలను విడుదల చేయవు.
వాస్తవంగా కాగితం కప్పు కదా.. సురక్షితమే అనే భ్రమలో ఉండకండి. బయట టీ తాగేటప్పుడు మీ స్వంత గ్లాసును వెంట తీసుకెళ్లడం లేదా మట్టి పాత్రలను వాడమని దుకాణదారుడిని కోరడం మంచిది. ఆరోగ్యం విషయంలో చేసే చిన్న మార్పు పెద్ద ప్రమాదాలను తప్పిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..