Longevity Secrets: 117 ఏళ్ల బామ్మ లైఫ్ సీక్రెట్.. 3 పూటలా ఇది తింటే రోగాలు లేని జీవితం

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన మరియా బ్రన్యాస్ మొరెరా 117 ఏళ్లు జీవించారు. మరియా ఇంతకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి గల రహస్యాలు ఏమిటి? ఆమె జీవితం, జీవనశైలిపై జరిగిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మెడిటరేనియన్ ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ నడవడం లాంటి ఆమె పాటించిన 5 సాధారణ అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Longevity Secrets: 117 ఏళ్ల బామ్మ లైఫ్ సీక్రెట్.. 3 పూటలా ఇది తింటే రోగాలు లేని జీవితం
5 Longevity Tips From The World's Oldest Person

Updated on: Sep 29, 2025 | 8:29 PM

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా పరిగణించబడిన మరియా బ్రన్యాస్ మొరెరా 117 సంవత్సరాలు జీవించి, 2024 ఆగస్టులో కన్నుమూశారు. ఈ USలో జన్మించిన స్పానిష్ మహిళ దీర్ఘాయుష్షు వెనుక ఉన్న కీలక అంశాలను ‘సెల్ రిపోర్ట్స్ మెడిసిన్’ అనే పత్రికలో ప్రచురించబడిన అధ్యయనం విశ్లేషించింది. ఆమె ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి.

మెడిటరేనియన్ ఆహారం: మీరు ఏమి తింటారు అనే దానిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మొరెరా సమతుల్య మెడిటరేనియన్ ఆహారాన్ని పాటించారు. ఇది ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఆహారం! ఈ ఆహారం కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆలివ్ నూనెతో నిండి ఉంటుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి ఇది చాలా ప్రయోజనకరం. ఈ ఆహారంలో చేపలు, పౌల్ట్రీ మితంగా, ఎరుపు మాంసం, స్వీట్లు పరిమితంగా ఉంటాయి.

లాంగ్ నడక: మొరెరా పల్లెటూరిలో జీవించారు. ఆమె చురుకైన జీవనశైలి పాటించారు. అంటే ఆమె రోజూ జిమ్ కు వెళ్లలేదు. బదులుగా, ఆమె ఎక్కువ కదలికపై దృష్టి సారించారు. రోజువారీగా ఒక గంట సేపు నడిచేవారు. నడక అనేది మొత్తం ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ముడిపడిన వ్యాయామం. 2024 అధ్యయనం నడక దీర్ఘాయుష్షుకు రహస్యం అని కనుగొంది.

రోజుకు 3 సార్లు పెరుగు: మొరెరాకు పెరుగు తినడం చాలా ఇష్టం. రోజుకు మూడు సార్లు పెరుగు తినేవారు. ఆమె దానికి చక్కెర, ఇతర స్వీటెనర్లు కలిపేవారు కాదు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, ఎక్కువ ఆయుష్షుతో ఇది ముడిపడి ఉంటుంది.

సామాజిక జీవితం: పల్లెటూరిలో జీవించిన మొరెరా చురుకైన సామాజిక జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆమె కుటుంబం, స్నేహితులతో నాణ్యమైన సమయం గడపడానికి ఇష్టపడేవారు. పుస్తకాలు చదవడం, తోట పెంచడం, పియానో వాయించడం ఆమె జీవితంలో భాగం. 2023 అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ ఇతరులతో కలవడం ఎక్కువ ఆయుష్షుకు దోహదపడుతుంది. వారంలో లేదా ప్రతిరోజూ సామాజికంగా కలసిన వారికి ఎక్కువ కాలం మరణం ఆలస్యమైందని పరిశోధకులు కనుగొన్నారు.

పొగ, మద్యం దూరం: ఈ అతివృద్ధురాలు జీవితంలో ఎప్పుడూ పొగతాగలేదు. మద్యం తాగలేదు. మద్యం సేవించడం, ధూమపానం దీర్ఘకాలిక అనారోగ్యం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మొరెరాకు ఈ అలవాట్లు లేకపోవడం ఆమె దీర్ఘాయుష్షుకు గణనీయంగా దోహదపడింది.