
చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతూ ఫలితం లేక నిరాశ చెందుతుంటారు. కానీ మన పూర్వీకులు, రాజవంశీకులు తమ చర్మం ఎప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా ఉండటానికి ఒక రహస్య తైలాన్ని ఉపయోగించేవారు. ఆయుర్వేద గ్రంథాలలో ‘చర్మ సంరక్షణ అమృతం’గా పిలువబడే ఆ నూనె.. ఇప్పుడు మళ్ళీ ఆధునిక ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం కొద్ది చుక్కలతోనే మీ ముఖంపై రాజసం ఉట్టిపడేలా చేసే ఆ వేదకాలం నాటి అద్భుతం పేరే ‘కుంకుమాది తైలం’. దీని చరిత్ర ఏంటి? ఇందులో ఏయే మూలికలు దాగి ఉన్నాయి?
కుంకుమాది అనే పేరు సంస్కృత పదమైన ‘కుంకుమ’ నుంచి వచ్చింది. కుంకుమ అంటే కుంకుమపువ్వు లేదా కేసర్ అని అర్థం. పూర్వకాలంలో రాజకుటుంబీకులు తమ ముఖం ఎప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా ఉండటానికి ఈ తైలాన్ని ప్రధానంగా ఉపయోగించేవారు. ఇది చర్మ రంధ్రాలను మూసివేయకుండా, లోపలి నుంచి శుభ్రం చేసి సహజమైన మెరుపును అందిస్తుంది. జంతువులపై ఎటువంటి పరీక్షలు చేయకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారయ్యే ఈ నూనె ఇప్పుడు మళ్ళీ అందరి ఆదరణ పొందుతోంది.
కుంకుమాది తైలంలో ఉండే ప్రతి పదార్థం చర్మానికి ఒక వరమనే చెప్పాలి. కుంకుమపువ్వు ఈ తైలంలో ప్రధానమైనది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. మంజిష్ట ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమలు, మంటను తగ్గించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రక్తంలోని మలినాలను తొలగించి ముఖానికి సహజమైన మెరుపునిస్తుంది.
వట్టివేరు మచ్చలు, గాయాల గుర్తులు, మొటిమల మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. యష్టిమధు కళ్ల కింద నల్లటి వలయాలను, హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో ఇది కీలకం. చందనం చర్మానికి చలువనిచ్చి సూర్యరశ్మి వల్ల వచ్చే ట్యాన్‌ను తొలగిస్తుంది. పాలలో ఉండే విటమిన్ బి, ఏహెచ్‌ఏలు (AHAs) చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. కలబంద చర్మానికి అవసరమైన తేమను అందించి, దెబ్బతిన్న కణాలను పునరుద్ధరిస్తుంది.
చాలామంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు, ఫైన్ లైన్స్ చూసి ఆందోళన చెందుతుంటారు. కుంకుమాది తైలంలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. ప్రతిరోజూ దీనిని వాడటం వల్ల చర్మం బిగుతుగా మారి, యవ్వనంగా కనిపిస్తుంది.
ఇది సహజ సిద్ధమైన నూనె కాబట్టి దుష్ప్రభావాలు ఉండవు. కానీ విపరీతమైన జిడ్డు చర్మం ఉన్నవారు లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు దీనిని వాడకపోవడమే మంచిది. అలాగే దీనిని కళ్ళలోకి వెళ్లకుండా చూసుకోవాలి, లేదంటే మంట పుట్టే అవకాశం ఉంది. ప్రకృతి ప్రసాదించిన కుంకుమాది తైలం మీ చర్మ సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే మన ఆయుర్వేద మూలికలే ఎప్పుడూ శ్రేయస్కరం.