ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ ఎత్తుకు పైఎత్తు కథ
Fox and Crane Story: మనం ఇతరులతో గౌరవంగా ప్రవర్తించాలని, ఎవరినైనా అవమానిస్తే అదే ఒక రోజు మనకు తిరిగి వస్తుందని చెప్పే నీతి కథ ఇది. పిల్లలకు చిన్న తనం నుంచి ఇలాంటి కథను వినిపిస్తే.. వారు ఎదిగాక ఇతరుల పట్ల గౌరవ, మర్యాదలతో మసలుకుంటారు. నక్క- కొంగ పూర్తి కథ ఇక్కడ చదవండి..

అనగనగా ఒక అందమైన అడవిలో ఒక నక్క, ఒక కొంగ నివసించేవి. అవి తరచూ కలిసి తిరుగుతూ స్నేహితుల్లా ఉండేవి. కానీ నక్కకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. అది ఇతరులను ఆటపట్టించి ఆనందపడేది. తన తెలివిని చూపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించేది. ఒక రోజు నక్క కొంగను చూసి, మిత్రమా! రేపు నా ఇంటికి భోజనానికి రా. నీ కోసం ప్రత్యేక విందు సిద్ధం చేస్తాను అని ఆహ్వానించింది.
కొంగ చాలా సంతోషించింది. మరుసటి రోజు సమయానికి నక్క ఇంటికి చేరుకుంది. నక్క రుచికరమైన సూప్ తయారు చేసింది. కానీ అది సూప్‌ను లోతు లేని వెడల్పాటి పళ్లెల్లో వడ్డించింది. నక్క తన నాలుకతో సులభంగా సూప్ తాగసాగింది. కానీ కొంగకు పొడవాటి ముక్కు ఉండటంతో ఆ పళ్లెంలో ఉన్న సూప్‌ను తాగడం సాధ్యం కాలేదు. ఎంత ప్రయత్నించినా ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది. నక్క కొంగ ఇబ్బంది పడటం చూసి నవ్వుతూ ‘ఏమైంది మిత్రమా? భోజనం నచ్చలేదా? ‘అని వెక్కిరించింది. కొంగకు నక్క ఉద్దేశం అర్థమైంది. కానీ కోపపడకుండా ప్రశాంతంగా, ‘భోజనం చాలా బాగుంది. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కొన్ని రోజుల తర్వాత కొంగ కూడా నక్కను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఈసారి నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని చెప్పింది. నక్క ఆనందంగా ఒప్పుకుంది. మరుసటి రోజు కొంగ ఇంటికి వెళ్లింది. కొంగ కూడా రుచికరమైన పాయసం తయారు చేసింది. కానీ దానిని పొడవైన మెడ ఉన్న సన్నని కుండల్లో వడ్డించింది. కొంగ తన పొడవాటి ముక్కును కుండలోకి పెట్టి హాయిగా తినసాగింది. కానీ నక్క ఎంత ప్రయత్నించినా కుండలోకి తన నోరు పెట్టలేకపోయింది. బయటకు కనిపిస్తున్న ఆహారాన్ని చూస్తూ ఆకలితో ఉండిపోయింది.
అప్పుడు కొంగ చిరునవ్వుతో ఇలా చెప్పింది.. మిత్రమా! నీవు నాకు చేసిన అతిథి మర్యాదనే నేను కూడా నీకు చేశాను. ఇతరులను అవమానించడం సరదా కాదు. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో, ఒక రోజు అదే మనకు తిరిగి వస్తుంది అని చెప్పింది. కొంగ మాటలు విన్న నక్కకు తన తప్పు అర్థమైంది. అది సిగ్గుపడి, ‘నన్ను క్షమించు మిత్రమా. ఇకపై ఎవ్వరినీ అవమానించను’ అని చెప్పింది. ఆ రోజు నుంచి నక్క తన ప్రవర్తన మార్చుకుని అందరితో గౌరవంగా మెలగడం ప్రారంభించింది.
నీతి
ఇతరులను మోసం చేయకూడదు. ఇతరులను మోసం చేయకూడదు. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో అలానే ఫలితం పొందుతాము. ఎవరినైనా అవమానిస్తే అదే అవమానం ఒక రోజు మనకూ ఎదురవుతుంది. ఎలా విత్తితే అలా కోస్తాం అనే సత్యాన్ని ఈ కథ తెలియజేస్తుంది.
