మరో కొత్త ట్రెండ్..! బ్రాండ్స్‌ కాదు వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న GenZలు

ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు పెద్ద మార్పు మొదలైంది. ఒకప్పుడు ఖరీదైన బ్రాండ్ లోగోలను ప్రదర్శించడం స్టేటస్ సింబల్‌గా భావించేవారు. గూచీ బెల్ట్, లూయి విట్టన్ హ్యాండ్‌బ్యాగ్ ఉంటే తాము సక్సెస్‌ఫుల్ అని లోకానికి చాటిచెప్పే క్రమంలో యువత పోటీ పడేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోని మాల్స్‌లో గమనిస్తే, యువతరం (జెన్-జీ) పెద్ద పెద్ద లోగోలు ఉన్న దుస్తులను పక్కన పెట్టి, సాదాసీదా లినెన్ దుస్తులు, వింటేజ్ డెనిమ్ వైపు మొగ్గు చూపుతోంది.

మరో కొత్త ట్రెండ్..! బ్రాండ్స్‌ కాదు వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న GenZలు
Gen Z Is Redefining Fashion.jpg

Updated on: May 26, 2026 | 8:17 AM

జెన్-జీ తరం అంతా ఆన్‌లైన్ ప్రపంచంలో పెరిగిన వారు. ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా వచ్చే ఫ్యాషన్ ట్రెండ్స్ ఎంత వేగంగా మారుతాయో, ఎంత త్వరగా పాతబడతాయో వీరు నిశితంగా గమనించారు. ఒకే ఫ్యాక్టరీలో తయారైన సాధారణ వస్త్రానికి బ్రాండ్ పేరు తగిలించి, వేల రూపాయల అదనపు ధర వసూలు చేస్తున్నారనే నిజం వారికి తెలుసు. కాబట్టి, కేవలం బ్రాండ్ కోసం డబ్బు వృథా చేయడం వారికి ఇష్టం లేదు. ఇప్పుడు వారు వెతికేది లోగోను కాదు, ఫాబ్రిక్ నాణ్యతను, కట్‌ను మాత్రమే. తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, ధరించగానే సౌకర్యంగా అనిపించే దుస్తులకే వారు ఓటేస్తున్నారు.

వింటేజ్ లుక్, పర్యావరణ స్పృహ..

లేటెస్ట్ ట్రెండ్స్ వెంబడించే బదులు, సెకండ్ హ్యాండ్ షాపింగ్, థ్రిఫ్ట్ స్టోర్లు, ఫ్లీ మార్కెట్ల వైపు జెన్-జీ ఆసక్తి చూపిస్తోంది. పాత లెవీస్ జాకెట్ లేదా అమ్మమ్మ కాలం నాటి పట్టుచీర ధరించడంలో వారికి ఒక గొప్ప అనుబంధం, క్యారెక్టర్ కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పర్యావరణ స్పృహ. వేగంగా మారిపోయే ఫ్యాషన్ వల్ల పర్యావరణానికి జరిగే హానిని వారు గుర్తిస్తున్నారు. ‘క్విట్ లగ్జరీ’ అనే కొత్త ధోరణిని వారు అందిపుచ్చుకుంటున్నారు. సాదా డిజైన్ ఉన్న నాణ్యమైన దుస్తులు సంవత్సరాల తరబడి మన్నుతాయి, తర్వాతి తరానికి అందించవచ్చు, అవసరమైతే రీసేల్ కూడా చేయవచ్చు. తక్కువ దుస్తులు కొని, నాణ్యమైన వాటిని ఎంచుకోవడమే వారి కొత్త ఫిలాసఫీ.

ఫ్యాషన్ పరిశ్రమకు కొత్త పాఠం..

ఈ మార్పును గమనించిన లగ్జరీ బ్రాండ్లు సైతం లోగోల ప్రభావాన్ని తగ్గించి, క్రాఫ్ట్‌మాన్‌షిప్, మెటీరియల్ క్వాలిటీపై దృష్టి పెడుతున్నాయి. జెన్-జీ పంపే సందేశం చాలా స్పష్టంగా ఉంది: ఫ్యాషన్ అనేది కేవలం స్టేటస్ సింబల్ కాదు, అదొక స్వీయ వ్యక్తీకరణ. నాణ్యత, సౌకర్యం, వ్యక్తిత్వం కలగలిసిన వస్త్రధారణకే ఇప్పుడు ప్రాధాన్యత. లోగోల మాయాజాలం కంటే, మనల్ని మనం పద్ధతిగా, క్లాసీగా చూపించుకోవడమే అసలైన ఫ్యాషన్ అని నేటి తరం నిరూపిస్తోంది. ఫ్యాషన్ పరిశ్రమలో వస్తున్న ఈ మార్పు, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం వల్ల పర్యావరణానికి, వినియోగదారులకు కూడా మేలే జరుగుతుంది.

Follow Us