టీ vs కాఫీ వెనక పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయొచ్చు..

పొద్దున్నే లేవగానే కొందరికి వేడివేడి టీ పడాల్సిందే.. మరికొందరికేమో స్ట్రాంగ్ కాఫీ తాగితేగానీ రోజు గడవదు. అయితే ఈ రెండిటి మధ్య ఉన్న తేడా కేవలం రుచికి లేదా వ్యక్తిత్వానికి సంబంధించినది మాత్రమే కాదు.. దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. మనం తాగే డ్రింక్ క్షణాల్లో మన ఆలోచనల వేగాన్ని, మన మెదడు పనితీరును మార్చగలదు.

టీ vs కాఫీ వెనక పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయొచ్చు..
Tea Vs Coffee

Updated on: Jun 28, 2026 | 8:44 AM

టీ, కాఫీ అనేది కేవలం డ్రింక్స్ కాదు అదొక ఎమోషన్. తలనొప్పి వచ్చినా, మూడ్ బాగాలేకున్నా, మైండ్ రీఫ్రెష్ కావాలన్ని ఈ రెండిటిలో ఏదో ఒకటి లోపల పడాల్సిందే. ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగకపోతే చాలా మందికి అసలు రోజే గడవదు. చాలా మంది నేను టీ లవర్, నేను కాఫీ లవర్ అని చెప్పుకుంటారు. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం కేవలం రుచికి లేదా వ్యక్తిత్వానికి సంబంధించినది మాత్రమే కాదు.. పూర్తి మానసిక, శాస్త్రీయతతో కూడుకున్నది. ఇటీవలి మానసిక పరిశోధనల ప్రకారం.. మనం తాగే పానీయం క్షణాల్లో మన ఆలోచనల వేగాన్ని, దైనందిన జీవితపు లయను మార్చగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కెఫీన్ పరిమాణంలో కొండంత తేడా..

కాఫీ, టీ రెండింటిలోనూ కెఫీన్ఉంటుంది. కానీ కాఫీలో దీని పరిమాణం చాలా ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధనల ప్రకారం..

ఒక కప్పు కాఫీలో: 95 నుండి 165 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది.

ఒక కప్పు బ్లాక్ టీలో: 25 నుండి 48 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది.

ఒక కప్పు గ్రీన్ టీలో: 25 నుండి 29 మిల్లీగ్రాములు ఉంటుంది.

ఈ భారీ తేడా వల్లే.. కాఫీ తాగిన వెంటనే మెదడుకు తక్షణ శక్తి, అత్యంత వేగవంతమైన ఉత్సాహం లభిస్తాయి. అదే టీ తాగితే మనస్సు ప్రశాంతంగా ఉంటూనే చురుగ్గా మారుతుంది.

టీ లోని రహస్య ఆయుధం.. ఎల్ థియానైన్..

కాఫీతో పోలిస్తే టీకి ఒక ప్రధాన శాస్త్రీయ ప్రయోజనం ఉంది. అదేంటంటే.. చాయ్‌లో ఎల్-థియానైన్ అనే అత్యంత ప్రభావవంతమైన అమైనో ఆమ్లం ఉంటుంది. కెఫీన్‌ను ఎల్ థియానైన్‌తో కలిపి తీసుకున్నప్పుడు, అది కష్టమైన పనులను చేసేటప్పుడు కూడా ఏకాగ్రతను (అద్భుతంగా పెంచుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ఈ ఏడాది ప్రచురితమైన ఒక మెటా విశ్లేషణ నివేదిక కూడా ఈ కాంబినేషన్ మానసిక స్థితిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని స్పష్టం చేసింది.

ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ టీ

సులభంగా చెప్పాలంటే.. టీ తాగడం వల్ల రాత్రికి రాత్రే ఎవరూ మేధావులు అయిపోరు. కానీ అది ఏకాగ్రతతో పనిచేసే ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. సాధారణంగా ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒక రకమైన ఆందోళన లేదా చేతుల వణుకు వస్తుంది. కానీ టీ లోని పదార్థాలు ఆ వణుకును రానివ్వవు. క్రమం తప్పకుండా టీ తాగే వారిలో ఒత్తిడి, నిరాశ స్థాయిలు తక్కువగా ఉంటాయని మానసిక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రీన్ టీ తాగేవారు ఇతరుల కంటే ఎక్కువ స్థిరమైన, ప్రశాంతమైన మానసిక స్థితిని కలిగి ఉంటారు.

జీవితపు లయ.. ఎవరి ఛాయిస్ వారిదే

దీని అర్థం టీ తాగేవారందరూ పుట్టుకతోనే ప్రశాంతంగా ఉంటారని కాదు. నిజానికి కాఫీ ఇచ్చే బలమైన కెఫీన్ కిక్‌ను తట్టుకోలేని వారి శరీరాలు, మనస్సులు సహజంగానే టీ వైపు మొగ్గు చూపుతాయి. కాఫీ శరీరంలో చాలా త్వరితగతిన ఉత్తేజాన్ని కలిగిస్తే, టీ ప్రభావం చాలా తేలికగా,దీర్ఘకాలం పాటు ఉంటుంది. తమ జీవితాన్ని కొంచెం నెమ్మదిగా, మరింత లయబద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడేవారు ఎక్కువగా టీని ఎంచుకుంటారు.

అంతిమంగా.. పరిశోధనలు చెబుతున్న ఆసక్తికరమైన నిజం ఏమిటంటే, ప్రతి వ్యక్తి తన రోజువారీ పని వేగానికి, మానసిక అవసరాలకు సరిపోయే డ్రింక్‌ను తన అచేతన మనస్సు ద్వారానే ఎంచుకుంటాడు. రోజు ప్రారంభంలో లేదా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు తక్షణ ఎనర్జీ బూస్ట్ కోసం కాఫీ ఒక అవసరమైతే.. ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రత సాధించడానికి ఒక కప్పు టీ ని ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి.

Follow Us