
తైవాన్ మహిళలు తమ అందాన్ని సహజ పదార్థాలతోనే కాపాడుకోవడం అలవాటు చేసుకున్నారు. షియా బటర్, వెదురు ఎసెన్స్, హెర్బల్ టీలు, అవసరమైన నూనెలతో తయారైన నేచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల వారి చర్మం నిత్యం తాజాగా ఉంటుంది. ఇంట్లో లభించే పదార్థాలతోనే సౌందర్య సంరక్షణ చేసుకోవడం వారి అందపు రహస్యాల్లో ఒకటి.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. తైవాన్ మహిళలు పుట్టగొడుగులు, నల్ల నువ్వులు, బ్లాక్ రైస్, గోజీ బెర్రీస్, ఎర్ర డేట్స్, సముద్రపు నాచు, మచా టీ లాంటి ఆరోగ్యకరమైన పదార్థాలను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. ఇవి చర్మానికి అవసరమైన కొలాజెన్ ఉత్పత్తిని పెంచి సహజ మెరుపును అందిస్తాయి. అంతేకాదు రోజూ కొన్ని గంటలు వ్యాయామానికి కేటాయించడం కూడా వారి ఫిట్‌నెస్ రహస్యం.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన గువా షా తైవాన్ మహిళల అందపు రహస్యాల్లో ఒకటి. క్వార్ట్జ్ లేదా జేడ్ రాయితో తయారైన ఈ సాధనం ముఖానికి మృదువుగా మర్దన చేయడాన్ని సూచిస్తారు. దీనివల్ల చర్మానికి రక్తప్రసరణ మెరుగుపడి సహజమైన కాంతిని అందిస్తుంది. పైగా చర్మం త్వరగా మాయిశ్చరైజర్‌ను గ్రహించేలా సహాయపడుతుంది.
చాలా మందికి జుట్టు సమస్యల్ని అధిగమించడానికి షాంపూలు, కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం అలవాటు. కానీ తైవాన్ మహిళలు అల్లంతో తయారైన షాంపూలు, పెర్ల్ పౌడర్, రోజ్ వాటర్‌తో చేసిన హెయిర్ మాస్క్ వంటివి ఉపయోగిస్తారు. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా చుండ్రును తగ్గించి కుదుళ్లకు తగిన పోషణ అందిస్తాయి.
తైవాన్ మహిళలు సహజమైన మార్గాల ద్వారా తమ అందాన్ని సురక్షితంగా కాపాడుకుంటారు. సహజ ఉత్పత్తుల వినియోగం, గువా షా మర్దన, పోషకాహారం, వ్యాయామం ఇవే వారి సౌందర్య రహస్యాలు. వయసు పెరిగినా చర్మం తాజాదనాన్ని కోల్పోకుండా ఉండటానికి వీరి నైపుణ్యాలు ఎంతో ఉపయోగపడతాయి.