
సాధారణంగా ఎండలో తిరిగినా, వ్యాయామం చేసినా లేదా తీవ్రమైన శారీరక శ్రమ పడ్డా చెమటలు పట్టడం సహజం. ఇది మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడే ఒక అద్భుతమైన ప్రక్రియ. కానీ కొంతమందికి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా, ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా ఎలాంటి కారణం లేకుండా అధికంగా చెమట పట్టడాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కొన్ని రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు.
శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి అవసరమైన దానికంటే విపరీతంగా చెమట పట్టే స్థితిని వైద్య పరిభాషలో “హైపర్‌హిడ్రోసిస్” అంటారు. కొంతమందికి ఇది కేవలం అరచేతులు, అరిపాదాలు, ముఖం పైనే ఎక్కువగా ఉంటే.. మరికొందరికి శరీరం మొత్తం విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇది వారి రోజువారీ పనులు, ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
శరీరంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్లే ఈ హైపర్‌హిడ్రోసిస్ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
హార్మోన్ల హెచ్చుతగ్గులు – థైరాయిడ్: శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు లేదా థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేస్తున్నప్పుడు మెటబాలిజం పెరిగి విపరీతమైన చెమటలు పడతాయి.
మధుమేహం: రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు శరీరం ఒక్కసారిగా చెమటలతో తడిసిపోతుంది.
ఇన్ఫెక్షన్లు – నాడీ వ్యవస్థ సమస్యలు: శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదా నరాల బలహీనత, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు ఈ సమస్య వస్తుంది.
విటమిన్ల లోపం: కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరంలో విటమిన్ డి, మెగ్నీషియం లోపాలు ఉన్నవారిలో కూడా అధికంగా చెమటలు పట్టే అవకాశం ఉందని తేలింది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
మందుల ప్రభావం: బరువు ఎక్కువగా ఉండటంతో పాటు, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడుతున్నప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా చెమటలు పట్టవచ్చు.
అధిక చెమటతో పాటు ఈ లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి..
ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించాలి.
హైడ్రేషన్‌గా ఉండండి: శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి ప్రతిరోజూ పుష్కలంగా నీరు, పండ్ల రసాలు త్రాగాలి.
దుస్తుల ఎంపిక: వేసవి లేదా ఉక్కపోతగా ఉన్న వాతావరణంలో తేలికపాటి, గాలి ఆడే కాటన్ దుస్తులను ధరించడం ఉత్తమం.
ఆహార నియమాలు: సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా వేడి చేసే పదార్థాలు, మసాలాలు తగ్గించాలి. అలాగే ఒత్తిడి వల్ల కూడా చెమటలు పెరుగుతాయి కాబట్టి యోగా, ధ్యానం ద్వారా మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచుకోవాలి.
ఒకవేళ మీకు ఎప్పటికప్పుడు ఈ సమస్య వేధిస్తూ, పైన చెప్పిన ఇతర లక్షణాలు కూడా తోడైతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఉత్తమం.