
వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల దృష్ట్యా మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పప్పు ధాన్యాల ఎంపికలో జాగ్రత్త అవసరం. కొన్ని పప్పులు శరీరానికి వేడిని కలిగిస్తే, మరికొన్ని చలవ చేస్తాయి. అందులో ప్రధానంగా పెసరపప్పు (Moong Dal). అన్ని పప్పుల కంటే పెసరపప్పు వేసవికి అత్యంత శ్రేష్ఠమైనది. దీని స్వభావం చలవ చేయడం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తూనే వేడిని తగ్గిస్తుంది. ఎండ దెబ్బ నుండి ఉపశమనం పొందడానికి పెసరపప్పు కట్టు లేదా పప్పుచారు తీసుకోవడం చాలా మంచిది.
ఇకపోతే, ఎర్ర కందిపప్పు (Masoor Dal). మసూర్ పప్పు అని కూడా పిలుస్తారు. ఈ పప్పులో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో శక్తిని పెంచడమే కాకుండా వేసవిలో కలిగే నీరసాన్ని తగ్గిస్తుంది. దీనిని తక్కువ మసాలాలతో వండుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
అలాగే, కొన్ని పప్పులు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని వేసవిలో ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అందులో మినప్పప్పు, శనగ, కందిపప్పు అతి ముఖ్యమైనవి. మినప్పప్పు (Urad Dal) భారీగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. శనగపప్పు (Chana Dal) వల్ల గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కందిపప్పు (Toor Dal) మనం నిత్యం వాడే పప్పు అయినప్పటికీ, వేసవిలో దీనిని పలచగా (పప్పుచారులా) తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.