పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!

తల్లిదండ్రులు గా మనం ఎప్పుడూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వారు జీవితం పై నమ్మకంతో, ధైర్యం గా ఎదగాలంటే చిన్నప్పటి నుంచే కొన్ని ముఖ్య విషయాలు అలవాటు చేయాలి. అలాంటి ముఖ్యమైన అలవాట్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
Parenting

Updated on: Jun 16, 2025 | 10:20 PM

పిల్లలతో తరచుగా మాట్లాడటం వల్ల వారిలో నమ్మకం పెరుగుతుంది. వారు ఏ సమస్యతో బాధపడుతున్నా మీతో పంచుకోగలగాలి. ఎలాంటి విమర్శలు లేకుండా వారి మాటలు వినడం, తమ మనసులోని భావాలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం వారి మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. చిన్న వయసులోనే ఈ అలవాటు వారిని జీవితాంతం ధైర్యంగా ఉంచుతుంది.

పిల్లలకు రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం, శ్వాస పద్ధతులు నేర్పడం వల్ల వారు తమ మనసును అదుపు చేసుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకుంటారు. ఇవి పరీక్షల సమయంలో మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. అలాగే వారి దృష్టి శక్తి మెరుగుపడటానికి.. చదువుపై ఏకాగ్రత పెరగడానికి చాలా ఉపయోగపడతాయి.

పిల్లలు ఇతరుల భావాలను అర్థం చేసుకోగలగాలి. ఒకరిపై దయ చూపడం, తప్పులు ఒప్పుకోవడం, బాధను అర్థం చేసుకోవడం లాంటి లక్షణాలు వారికి చిన్నప్పుడే అలవాటు చేయాలి. ఇవి వారి భావోద్వేగ తెలివితేటలను మెరుగుపరుస్తాయి. తమను తాము విశ్లేషించుకునే అలవాటు వారికి మంచి బంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.

ఈ రోజుల్లో పిల్లలు డిజిటల్ ప్రపంచానికి చాలా దగ్గరగా ఉంటున్నారు. అయితే దీన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే వారికి ప్రయోజనం కలుగుతుంది. వారికి మొబైల్, ల్యాప్‌ టాప్ వాడే నియమాలు నేర్పాలి. చదువు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం లాంటి మంచి పనులకే టెక్నాలజీ వాడేలా ప్రోత్సహించాలి. స్క్రీన్ టైమ్‌ కు ఒక పరిమితి పెట్టడం చాలా అవసరం.

ప్రతి పిల్లవాడిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. అది పాటలు పాడటం కావొచ్చు, బొమ్మలు వేయడం కావొచ్చు, ఆటలు కావొచ్చు. పిల్లల ఆసక్తి ఏదైతే ఉందో అందులో నైపుణ్యం పెరిగేలా వారిని ప్రోత్సహించాలి. అవసరమైతే ప్రొఫెషనల్ క్లాసుల్లో చేర్పించి వారిని మరింత మెరుగుపరచాలి. ఇది పిల్లలలో స్వయంప్రేరణను పెంచడమే కాకుండా.. జీవితంలో ముందుకు వెళ్లడానికి ధైర్యాన్ని ఇస్తుంది.

పిల్లలు బలంగా, సురక్షితంగా, విజయవంతంగా ఎదగాలంటే ఈ అంశాలు చాలా ముఖ్యం. తల్లిదండ్రులుగా మనం సరైన మార్గం చూపిస్తే పిల్లలు భవిష్యత్తులో ఏ ఒత్తిడినైనా అధిగమించి గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రేమ, సహనం, సరైన మార్గదర్శకత్వంతో వారి ప్రయాణానికి బలంగా నిలబడండి.