
చలికాలం వచ్చిందంటే చాలా మంది చలి నుండి రక్షణ కోసం దుప్పటి లేదా బెడ్‌షీట్‌తో ముఖం మొత్తం కప్పుకుని వెచ్చగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో అది సౌకర్యంగా అనిపించినప్పటికీ ఈ అలవాటు మీ శ్వాస వ్యవస్థకు, మొత్తం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ పద్ధతి మీ ఊపిరితిత్తులకు అందే తాజా గాలి పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మీరు మీ ముఖాన్ని దుప్పటితో కప్పుకున్నప్పుడు, మీరు వదిలేసిన గాలి దుప్పటి లోపల చిక్కుకుపోతుంది. తదుపరి శ్వాస తీసుకున్నప్పుడు మీరు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలినే మళ్ళీ పీల్చుకుంటారు. శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం వల్ల మీ మెదడు, గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఆక్సిజన్ తక్కువగా ఉండి CO₂ ఎక్కువగా ఉన్న గాలిలో నిద్రపోవడం వల్ల ఉదయం తలనొప్పి, అలసట, నోరు ఎండిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత అధికంగా ఉంటుంది.
ఈ అలవాటు కేవలం నిద్ర నాణ్యతను తగ్గించడమే కాకుండా, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు: నోటి నుండి వచ్చే తేమ దుప్పటి లోపల చిక్కుకుపోయి, అక్కడ వెచ్చని, తేమతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది బూజు పెరుగుదలకు, అలెర్జీ కారకాలకు అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఫలితంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అలెర్జీల ప్రమాదం పెరుగుతుంది.
నిద్ర నాణ్యత: ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉండి గాఢ నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇది రోజంతా బద్ధకాన్ని పెంచుతుంది.
గుండెపై ఒత్తిడి: CO₂ అధికంగా పీల్చుకోవడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి, హృదయ స్పందన రేటు, రక్తపోటు ప్రభావితమవుతాయి.
సురక్షితమైన, ఆరోగ్యకరమైన నిద్ర కోసం మీ ముఖం కప్పుకునే అలవాటును పూర్తిగా మానుకోవాలి. దీనికి బదులుగా ఈ సరైన పద్ధతులను పాటించండి.
వెచ్చని వస్త్రాలు: చలిని నివారించడానికి వెచ్చని బట్టలు, టోపీ, సాక్స్ ధరించి నిద్రపోండి. ఎందుకంటే శరీరంలోని వేడి ప్రధానంగా తల, కాళ్ళ ద్వారా విడుదలవుతుంది.
దుప్పటి స్థానం: దుప్పటిని మీ మెడ వరకు మాత్రమే ఉంచండి, ముఖానికి దూరంగా ఉంచండి.
హీటర్ వాడకం: పడుకునే ముందు గదిని వెచ్చగా చేయడానికి హీటర్‌ను ఉపయోగించండి. కానీ నిద్రించే ముందు దాన్ని తప్పకుండా ఆపివేయండి.
ఆరోగ్యకరమైన నిద్ర కోసం, చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి